AP Legislative Council: బిల్లు ఆమోదం పొందలేదన్న కారణంతో మండలిని రద్దు చేస్తారా?: పీడీఎఫ్ అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం

  • ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించాలి
  • మండలి నిర్వహణతో రూ.60 కోట్లు వృథా అవుతున్నాయన్నటం సరికాదు
  • మండలిని కించపర్చటం తగదు

ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలి రద్దు చేయాలన్న వైసీపీ ప్రభుత్వం ఆలోచనను పీడీఎఫ్ పార్టీ ఆక్షేపించింది. మండలి నిర్వహణతో రూ.60 కోట్లు వృథా అవుతున్నాయంటూ సీఎం జగన్, మంత్రులు శాసనసభలో మాట్లాడటం సరికాదని పార్టీ నేతలన్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆమాత్రం మేధావులు అసెంబ్లీలో కూడా ఉన్నారని వైసీపీ నేతలు మండలిని కించపరచడాన్ని వారు తప్పుబట్టారు.

మండలిలో రాజకీయ నేతలే కాకుండా లక్షలాది మంది పట్టభద్రులు, ఉపాధ్యాయులచే ప్రత్యక్షంగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీలు కూడా ఉన్నారని చెప్పారు. మండలిలో చర్చలు అర్థవంతంగా సాగుతాయని మంత్రులే చాలాసార్లు చెప్పారని వారు పేర్కొన్నారు. అనేక సమస్యలను పరిష్కరించేందుకు మండలిలో తాము పోరాడుతున్నామన్నారు. తమ బిల్లులు ఆమోదం పొందలేదన్న కారణంతో మండలిని రద్దు చేస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీ మేనిఫెస్టోలోనూ మండలి రద్దు అంశాన్ని చేర్చలేదని పేర్కొన్నారు.

More Telugu News