Telugudesam: డబ్బు లెక్కపెట్టుకుంటూ ఇడుపులపాయ బంకర్ల నుంచే జగన్ పరిపాలించొచ్చు: యనమల సెటైర్లు

  • టీడీపీ హయాంలో మేము విదేశీ పర్యటనలకు వెళ్లాం
  • అమరావతిని మాతో పాటు విదేశాలకు పట్టుకుపోలేదు
  • ఫోన్ ద్వారా డైరెక్షన్స్ ఇస్తూ ప్రభుత్వాన్ని నడిపించాం

నాడు తమిళనాడు సీఎం జయలలిత ఊటీ నుంచి తన పరిపాలన చేశారని, ఎక్కడి నుంచి అయినా పరిపాలించవచ్చని సీఎం జగన్ నిన్న చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు కౌంటర్ ఇచ్చారు. ఏపీ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ ని టీడీపీ నేతలు ఈరోజు కలిశారు.

అనంతరం, మీడియాతో యనమల మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామిక పద్ధతులు, అవకతవకలు, అణచివేత ధోరణి గురించిన పూర్తి సమాచారాన్ని ఓ పెన్ డ్రైవ్ ద్వారా గవర్నర్ కు అందజేశామని చెప్పారు. గవర్నర్ కు ఉండే అధికారాలను ఉపయోగించి ప్రభుత్వంపై సరైన చర్యలు చేపట్టాలని కోరినట్టు వివరించారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని గవర్నర్ తమకు చెప్పారని అన్నారు.

రాజధానిని జయలలిత మార్చలేదని, ఊటీలో విశ్రాంతి తీసుకునే సమయంలో అక్కడి నుంచి ఆమె తన సూచనలు, ఆదేశాలు ఇస్తూ పరిపాలించారని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో తాము విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు, ఫోన్ ద్వారా సూచనలు చేసి ప్రభుత్వాన్ని నడిపించాము తప్పితే, రాజధాని అమరావతిని తమతో పాటు తీసుకెళ్లలేదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

అదేవిధంగా జగన్ కూడా చక్కగా ఇడుపులపాయ నుంచి పరిపాలన చేయొచ్చని సూచించారు. ఇడుపులపాయ చాలా బాగుంటుందని, అక్కడి నుంచే జగన్ ని పరిపాలించమనండి ఎవరొద్దన్నారు? అక్కడ బంకర్లు కూడా ఉన్నాయని, అందులో దాచిన డబ్బులు కూడా ఆయన లెక్కపెట్టుకోవచ్చని సెటైర్లు విసిరారు. ఈ సందర్భంగా నియంత హిట్లర్ గురించి ఆయన ప్రస్తావించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో హిట్లర్ తన బంకర్లలో తలదాచుకుని అక్కడి నుంచే జర్మనీని పరిపాలించారని గుర్తుచేశారు.

వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు భయం?

బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళతాయంటే, ప్రజాభిప్రాయం తీసుకుంటామంటే వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు భయం? అని యనమల ప్రశ్నించారు.

More Telugu News