Amjath Basha: ఎవరికీ తెలియని రూల్ నెం.71ను తెరపైకి తెచ్చారు: ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా

  • తాడేపల్లిలో డిప్యూటీ సీఎం మీడియా సమావేశం
  • బిల్లు ఆమోదం పొందకూడదనే రూల్ నెం.71 తీసుకువచ్చారని ఆరోపణ
  • ప్రభుత్వం తరఫున తామే ఓ మెట్టు దిగామన్న బాషా

మూడు ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని తీసుకువచ్చిన వికేంద్రీకరణ బిల్లుకు టీడీపీ ఉద్దేశపూర్వకంగానే అడ్డుతగులుతోందని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆరోపించారు. మూడు ప్రాంతాల అభివృద్ధిని కోట్లాది మంది ప్రజలు కోరుకుంటూ, బిల్లు ఆమోదం కోసం ఎదురుచూస్తుంటే టీడీపీ సభ్యులు దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఈ బిల్లు చర్చకు రాకూడదని రూల్ నెం.71 తీసుకువచ్చారని, అసలీ రూల్ ఎవరికీ తెలియదని అన్నారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ బిల్లు కోసం ప్రభుత్వం తరఫున తామే ఓ మెట్టుదిగి చర్చకు సుముఖత వ్యక్తం చేశామని తెలిపారు.

చర్చ రసవత్తరంగా సాగిందని, లోకేశ్ కూడా అర్థవంతంగా చాలాసేపు మాట్లాడారని కితాబిచ్చారు. కానీ, చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తి ఏ పార్టీకి కొమ్ము కాయడం సబబు కాదని అన్నారు. పెద్దల సభను నడిపించాల్సిన వ్యక్తి ఎలా ఉండాలంటే, ఆయన ఓ పార్టీ వ్యక్తిగా వ్యవహరించరాదని, చైర్మన్ పీఠాన్ని గౌరవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కానీ చర్చంతా పూర్తయిన తర్వాత చివరి పది నిమిషాల్లో చైర్మన్ ప్రసంగం సాగిన తీరు తమకు అసంతృప్తి కలిగించిందని అన్నారు. చైర్మన్ నిబంధనలకు లోబడి వ్యవహరించాలని తాము కోరుకున్నామని అంజాద్ బాషా తెలిపారు. తాడేపల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News