60 ఏళ్ల బామ్మగారు.. 22 ఏళ్ల కుర్రాడు.. ఎంత ఘాటు ప్రేమయో!

24-01-2020 Fri 09:58
  • ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఘటన
  • బామ్మకు ఏడుగురు కొడుకులు, ఏడుగురు మనవళ్లు
  • ఆమెను తప్ప మరెవరినీ చేసుకునేది లేదంటున్న కుర్రాడు
ప్రేమ ఎప్పుడు, ఎందుకు పుడుతుందో చెప్పడం కష్టం. ఈ మాట అక్షరాల నిజమంటారు ఈ స్టోరీ వింటే. ఏడుగురు కుమారులు, ఏడుగురు మనవళ్లు ఉన్న 60 ఏళ్ల బామ్మ.. 22 ఏళ్ల యువకుడి ప్రేమలో నిండా మునిగిపోయింది. హరిహరాదులు అడ్డొచ్చినా తమను వేరుచేయలేరని ఇద్దరూ బాసలు చేసుకున్నారు. అయితే, వన్ ఫైన్ డే బామ్మ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ముసలాయన చెప్పింది విన్న పోలీసులకు మూర్ఛ వచ్చినంత పనైంది.

ఆగ్రాకు చెందిన  60 ఏళ్ల బామ్మకు భర్త, ఏడుగురు కుమారులు, ఏడుగురు మనవళ్లు ఉన్నారు. ఎట్మదుద్దౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాశ్‌నగర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు.. ఆ బామ్మను చూసిన తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాడు. ఆమె కూడా అతడిపై మనసు పారేసుకుంది. ‘ఐ లవ్ యూ’లు చెప్పుకున్నారు. ప్రేమ బాసలు చేసుకున్నారు. తన భార్య యువకుడి ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలుసుకున్న ముసలాయన కుమారుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పి ఫిర్యాదు చేశాడు.

ఆ పెద్దాయన చెప్పింది విన్న పోలీసులు తొలుత విస్తుపోయారు. వారు పోలీస్ స్టేషన్‌లో ఉండగానే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ మొదలైంది. తాను అతడినే పెళ్లి చేసుకుంటానని బామ్మ, ఆమెను తప్ప మరెవరినీ చేసుకునేది లేదని యువకుడు పట్టుబట్టారు. ఇది చూసిన పోలీసులు తలలు పట్టుకున్నారు. లాభం లేదని ఇద్దరినీ కూర్చోబెట్టి అలా కుదరదని మంచి మాటలు చెబుతూ మనసులు మార్చే ప్రయత్నం చేశారు.

ఎవరు ఎంతగా చెప్పినప్పటికీ వారు మాత్రం ససేమిరా కుదరదని తేల్చి చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోని పోలీసులు బామ్మ భర్త ఫిర్యాదుతో ఆ యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం సోషల్ మీడియాకు ఎక్కడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. తర్వాత ఏం జరగబోతోందన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.