Uttar Pradesh: పాడుబావిలో పడిన కుక్క పిల్లలు.. ఫోన్ చేస్తే వచ్చి రక్షించిన పోలీసులు!

  • 112కు ఫోన్ చేసి సమాచారం అందించిన పోలీసులు
  • బావిలో పాములు ఉన్నాయన్నా వినిపించుకోని అధికారి
  • ‘బిగ్ సెల్యూట్ టు ఆఫీసర్’ అంటూ నెటిజన్ల ప్రశంసలు

ప్రమాదవశాత్తు ఓ పాడుబడిన బావిలో మూడు కుక్కపిల్లలు పడిపోవడం చూసిన స్థానికులు వెంటనే 112 నంబరుకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వచ్చి వాటిని రక్షించారు. ఈ క్రమంలో ఓ పోలీసు అధికారి తన ప్రాణాలను పణంగా పెట్టడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని ఆర్మోహాలో జరిగిందీ ఘటన.

కుక్క పిల్లలు బావిలో పడిపోయినట్టు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. చీకటిగా ఉన్న పాడుబడిన బావిలోంచి వాటి అరుపులు వినిపిస్తున్నాయి. బావిలో ఉన్న వాటిని పైనుంచే తీసేందుకు ప్రయత్నించారు. అయితే, సాధ్యం కాలేదు. దీంతో ఓ పోలీసులు అధికారి స్వయంగా రంగంలోకి దిగారు. నేరుగా బావిలోకి దిగేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు.

అందులో పాములు ఉన్నాయని, దిగితే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. బావిలోకి దిగి మూడు పప్పీలను రక్షించి బయటకు తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాణాలకు తెగించి కుక్క పిల్లలను రక్షించిన పోలీసు అధికారిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పప్పీలను రక్షిస్తున్న ఫొటోలను యూపీ  పోలీస్ విభాగం తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ‘బిగ్ సెల్యూట్ టు ఆఫీసర్’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

More Telugu News