Telangana: మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి.. రేపు మధ్యాహ్నానికి ఫలితాలు!

  • రేపు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం
  • నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మూడు చోట్ల రీపోలింగ్
  • 27న మేయర్, చైర్ పర్సన్ల ఎన్నిక

తెలంగాణలో జరిగిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తిచేశారు. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా, మధ్యాహ్నం లోపే ఫలితాలు వెలువడనున్నాయి. ఆ లోపే ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. లెక్కింపులో ఎలాంటి గందరగోళం లేకుండా చూసుకోవాలని సూచించింది.

తెలంగాణలోని 120 మునిసిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లలో రెండు రోజుల క్రితం ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవమైనవి కాకుండా మిగతా వాటికి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. కాగా, నేడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు, మహబూబ్‌నగర్ పోలింగ్ కేంద్రంలో ఒక చోట రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న మేయర్, చైర్ పర్సన్ల ఎన్నికను నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు.

More Telugu News