Jagan: నిన్న మండలిలో పరిణామాలు నా మనసును ఎంతగానో బాధించాయి: ఏపీ సీఎం జగన్

  • నా నమ్మకంతో పాటు ఐదు కోట్ల ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు
  • మండలి చైర్మన్ నిష్పక్షపాతంగా సభ నిర్వహించే పరిస్థితి లేదు
  • ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేశారు

నిన్న శాసనమండలిలో జరిగిన పరిణామాలు తన మనసును ఎంతగానో బాధించాయని ఏపీ సీఎం జగన్ అన్నారు. కొన్ని అంశాలను సభ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకువస్తున్నానంటూ ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 151 సీట్లతో తాము గెలిచామని, ‘ఇది ప్రజల సభ, ప్రజలు ఆమోదించిన సభ’, ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసం ఏర్పడ్డ సభ అని, చట్టాలు చేయడానికి ఏర్పాటైన సభ అని అన్నారు. ‘మండలి’ అన్నది చట్టసభలో భాగం కనుక చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మామని, తన నమ్మకంతో పాటు ఐదు కోట్ల ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ నిన్న శాసనమండలిలో జరిగిన తంతును అందరూ గమనించారని అన్నారు.

శాసనమండలి చైర్మన్ షరీఫ్ నిష్పక్షపాతంగా సభను నిర్వహించే పరిస్థితి లేదని అన్నారు. నిన్న గ్యాలరీలో చంద్రబాబు కూర్చుని జారీ చేసిన ఆదేశాలను చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమౌతుందని  విమర్శించారు. శాసనసభ పంపిన వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో చర్చించి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చని, లేకపోతే, సవరణలు కోరుతూ తిప్పి పంపించవచ్చు అని, చట్టం కూడా ఇదే విషయాన్ని చెబుతోందని అన్నారు. కానీ, వాటిని లెక్క చేయకుండా విచక్షణా అధికారం అంటూ కౌన్సిల్ చైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేశారని మండిపడ్డారు.

నిబంధనల ప్రకారం బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపే అధికారం తనకు లేదని చైర్మన్ షరీఫ్ చెప్పారని, బిల్లు పెట్టిన పన్నెండు గంటల్లోపే సవరణలు, ప్రతిపాదనలు కూడా ఇవ్వాలని చెప్పిన ఆయనే, రూల్స్ ను అతిక్రమించారని విమర్శించారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపకూడదన్న మంత్రుల వాదనతో పాటు బీజేపీ, పీడీఎఫ్, వామపక్ష సభ్యులు ఏకీభవించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తనకు ఉన్న విచక్షణాధికారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని స్వయంగా షరీఫే అంగీకరించారని విమర్శించారు.

More Telugu News