Assam: అసోం ముఖ్యమంత్రి ఎదుట ఆయుధాలతో లొంగిపోయిన 644 మంది మిలిటెంట్లు

  • లొంగిపోయిన 8 గ్రూపులకు చెందిన మిలిటెంట్లు
  • ఇది అద్భుతమైన రోజు అన్న రాష్ట్ర డీజీపీ
  • అందరికీ పునరావాసం కల్పిస్తామని ప్రకటన

అసోంలో ఎవరూ ఊహించని ఒక చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ సమక్షంలో ఏకంగా 644 మంది మిలిటెంట్లు లొంగిపోయారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి సంబంధించి ఇదొక అద్భుతమైన రోజు అని అన్నారు. రాష్ట్రంలో టెర్రరిస్టు కార్యకలాపాలు పెరిగిన తరుణంలో, త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సమయంలో ఇంతమంది మిలిటెంట్లు లొంగిపోవడం సాధారణ విషయం కాదని చెప్పారు.

లొంగిపోయిన వారు 8 మిలిటెంట్ గ్రూపులకు చెందినవారని మహంత తెలిపారు. వీరంతా తమ ఆయుధాలను వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయారని చెప్పారు. ముఖ్యమంత్రి సమక్షంలో లొంగిపోయిన సమయంలో వారు తమ వద్ద ఉన్న ఏకే-47, ఏకే-56 ఆయుధాలతో పాటు బాంబులు, పేలుడు పదార్థాలను కూడా పోలీసులకు అందించారని తెలిపారు. స్వావలంబన పథకం కింద వీరందరికీ పునరావాసం కల్పిస్తామని చెప్పారు.

More Telugu News