'సిరిసిరిమువ్వ' సినిమా అలా తెరపైకి వచ్చిందట!

23-01-2020 Thu 15:56
  • కాలేజ్ రోజుల నుంచి నాటకాలు వేసేవారు 
  • చెన్నైలో ఎదురైన చేదు అనుభవాలు
  • స్నేహితులతో కలిసి నిర్మాతగా మారారన్న రాజా 
పూర్ణోదయా క్రియేషన్స్ బ్యానర్ పై ఆణిముత్యాల వంటి ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఏడిద నాగేశ్వరరావు నిర్మాణంలో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమాలను ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేదు. అలాంటి ఆ బ్యానర్ నుంచి 'ఆపద్బాంధవుడు' తరువాత సినిమాలు రాలేదు.

తాజా ఇంటర్వ్యూలో ఏడిద నాగేశ్వరరావు కుమారుడు రాజా మాట్లాడుతూ .. 'నాన్నగారు కాకినాడలోని కాలేజ్ లో చదువుతున్నప్పుడే నాటకాలు వేసేవారు. ఆయన బృందంలో హరనాథ్ .. వి.బి.రాజేంద్ర ప్రసాద్ .. విజయ్ చందర్ .. మాడా ఉండేవారు. నటుడిగా సినిమాల్లో ట్రై చేయడానికి ఆయన చెన్నై వచ్చారు. అక్కడ ఆయనకి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తిరిగి ఊరు వెళ్లడానికి మనసొప్పక, చిన్న చిన్న వేషాలు .. రేడియో నాటకాలు .. డబ్బింగులతో నెట్టుకొచ్చారు. ఆ తరువాత కొంతమంది స్నేహితులతో కలిసి తొలిసారిగా ఆయన 'సిరిసిరిమువ్వ'ను నిర్మించారు. ఎంతోమంది నిర్మాతలు పక్కన పెట్టేసిన ఆ కథను ఆయన కెమెరా ముందుకు తీసుకొచ్చే సాహసం చేశారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే" అని చెప్పుకొచ్చారు.