Cell Phone: ఇలా సెల్ఫీ తీసుకుంటుంటే... అలా సెల్లు లాక్కెళ్లిన చోర శిఖామణి... వైరల్ వీడియో ఇదిగో!

  • స్నేహితురాలితో రోడ్డుపై సెల్ఫీ దిగుతున్న యువతి
  • ఒడుపుగా లాగేసుకుని వెళ్లిన దొంగ
  • ఎవరూ ఏమీ చేయలేకపోయిన వైనం

చాలా రోజుల తరువాత తనను కలిసిన స్నేహితురాలితో సెల్ఫీ దిగుదామని, ఓ యువతి ప్రయత్నిస్తున్న వేళ, హఠాత్తుగా బైక్ పై వచ్చిన ఓ దొంగ, ఆ సెల్ ఫోన్ ను లాక్కెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు సమీపంలో అమర్చిన ఓ సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తం కాగా, అవిప్పుడు వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ లో ఈ ఘటన జరిగింది. రోడ్డుపై నిలుచున్న ఓ యువతి, మరో యువతితో కలిసి సెల్ఫీ దిగుతుంటే, ఎరుపు రంగు టీషర్ట్ తో బైక్ పై వచ్చిన ఓ యువకుడు, దాన్ని ఒడుపుగా లాగేసుకుని వెళ్లిపోయాడు. తమ స్మార్ట్ ఫోన్ తీసుకుని వెళుతున్న అతన్ని వారు ఏమీ చేయలేకపోయారు.

ఈ ఘటనను చూసిన కొందరు స్థానికులు అతన్ని వెంబడించాలని ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వెలువడుతోంది. రోడ్లపై ఈ తరహా పనులేంటని కొందరు మండిపడుతుంటే, జాగ్రత్తగా ఉండాలికదా? అని మరికొందరు సలహాలు ఇస్తున్నారు. ఇక ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారా? లేదా? అన్న విషయం తెలియరాలేదు. వైరల్ అవుతున్న వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News