Mumbai: ముంబై ఇక లండన్.. రోజంతా కళకళ.. కీలక విధానానికి ‘మహా’ కేబినెట్ ఆమోదం

  • ‘ముంబై 24 గంటలు’ విధానానికి కేబినెట్ ఆమోద ముద్ర
  • ఇక రాత్రిపూట కూడా తెరుచుకోనున్న దుకాణాలు, మాల్స్  
  • అదనపు ఉద్యోగాలు వస్తాయన్న మంత్రి ఆదిత్య థాకరే

ముంబై మహానగరం ఇకపై రోజంతా కళకళలాడనుంది. నగరంలోని మాల్స్, మల్టీప్లెక్స్‌లు, దుకాణాలు 24 గంటలూ తెరిచి ఉండనున్నాయి. ఇందుకు సంబంధించిన ‘ముంబై 24 గంటలు’ విధానానికి మహారాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ నెల 27 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. కేబినెట్ భేటీ అనంతరం పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరే మాట్లాడుతూ.. కేబినెట్ నిర్ణయం వల్ల మరిన్ని ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు.

లండన్‌లో ప్రస్తుతం ఈ విధానం అమల్లో ఉందన్న ఆయన.. దీనివల్ల ఐదు బిలియన్ పౌండ్ల అదనపు ఆదాయం లభిస్తోందన్నారు. అయితే, అన్నింటినీ తెరిచి ఉండాల్సిన అవసరం లేదని, ఎవరైతే తమ వ్యాపారాన్ని రాత్రిపూట కూడా కొనసాగించాలని కోరుకుంటారో వారు మాత్రమే దుకాణాలు తెరిచిపెట్టుకోవచ్చని అన్నారు.

వాణిజ్య ప్రాంతాల్లో దుకాణాలు, తినుబండారాలు, మాల్స్‌లోని థియేటర్లు, మిల్ కాంపౌండ్స్‌కు తొలి దశలో అనుమతి ఇస్తున్నట్టు మంత్రి ఆదిత్య థాకరే తెలిపారు. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్, నారీమన్ పాయింట్‌లో ఫుడ్ ట్రక్స్‌కు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. అయితే, నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం జీవితకాలం నిషేధం విధిస్తామని హెచ్చరించారు.

రాత్రిపూట షిఫ్టులు చేసేవారికి, పర్యాటకులకు ఇక రాత్రల్లా కూడా ఆహారం అందుబాటులో ఉంటుందన్నారు. అయితే, పబ్బులు, బార్లు మాత్రం అర్ధరాత్రి దాటాక 1:30 గంటలకు యథావిధిగా మూతపడతాయని మంత్రి స్పష్టం చేశారు. కాగా, తాజా నిర్ణయం వల్ల పోలీసులపై ఎలాంటి అదనపు ఒత్తిడి పడే అవకాశం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు.

More Telugu News