Telangana: దావోస్ లో వరుస సమావేశాలతో తీరిక లేకుండా గడిపిన కేటీఆర్

  • దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు
  • సదస్సుకు ప్రపంచస్థాయి సీఈఓల రాక
  • గూగుల్ సీఈఓతో భేటీ అయిన కేటీఆర్
  • ఆయుధ తయారీ సంస్థలతోనూ సంప్రదింపులు

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ హాజరైన విషయం విదితమే. ఈ సదస్సుకు ప్రపంచస్థాయి సీఈఓలు, చైర్మన్లు కూడా రావడంతో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇదే అదనుగా కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా గడిపారు.

ప్రపంచంలో అగ్రశ్రేణి ఆయుధ తయారీ సంస్థ బీఏఈ సిస్టమ్స్ చైర్మన్ రోజర్ కార్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇప్పటికే అనేక ప్రపంచస్థాయి ఏరో స్పేస్, డిఫెన్స్ ఉత్పత్తుల తయారీదార్లు హైదరాబాద్ లో కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారని కేటీఆర్ ఆయనకు వివరించారు.

ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన ఫార్మా కంపెనీల్లో ఒకటైన జపాన్ సంస్థ టకెడా ఫార్మా సంస్థ ఉన్నతస్థాయి వర్గాలతోనూ కేటీఆర్ సంప్రదింపులు జరిపారు. ముఖ్యంగా, గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ తోనూ భేటీ అయ్యారు. హైదరాబాద్ లో గూగుల్ భవిష్యత్ కార్యాచరణ గురించి ఆయన సుందర్ పిచాయ్ తో మాట్లాడారు.

ఇవే కాకుండా, ఐడియో డిజైన్స్, కేపీఎంజీ, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, ఆర్ఓకే ఆటోమేషన్ వంటి సంస్థల ప్రతినిధులతో కేటీఆర్ ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ లో చర్చలు జరిపారు.

More Telugu News