ISRO: వ్యోమగాముల కంటే ముందు 'వ్యోమమిత్ర'ను అంతరిక్షంలోకి పంపుతున్న ఇస్రో

  • 2022లో గగన్ యాన్ మిషన్ ను చేపట్టనున్న ఇస్రో
  • ముగ్గురు వ్యోమగాములకు రష్యాలో శిక్షణ
  • ఈ ఏడాది చివర్లో మహిళా రోబో వ్యోమమిత్రను అంతరిక్షంలోకి పంపనున్న ఇస్రో

అంతరిక్షంలోకి భారతీయులను పంపేందుకు మన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వడివడిగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. 2022లో గగన్ యాన్ మిషన్ ద్వారా ముగ్గురు వ్యోమగాములను ఇస్రో అంతరిక్షంలోకి పంపబోతోంది. ఈ ముగ్గురు వ్యోమగాములను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఎంపిక చేశారు. వీరికి రష్యాలోని అంతరిక్ష కేంద్రంలో అవసరమైన శిక్షణను ఇవ్వనున్నారు. గగన్ యాన్ కు ఎంపికైన ముగ్గురు వ్యోమగాములు పురుషులే కావడం గమనార్హం.

అయితే ఈ ముగ్గురి కంటే ఓ ముందుగా ఓ మహిళను ఇస్రో అంతరిక్షంలోకి పంపనుంది. ఆమె పేరు 'వ్యోమమిత్ర'. అయితే, ఇది ఓ మహిళా హ్యూమనోయిడ్ రోబో కావడం విశేషం. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడం కంటే ముందే... ఈ వ్యోమమిత్రను నింగిలోకి పంపనుంది. గగన్ యాన్ లో భాగంగానే... ఈ ఏడాది చివర్లో ఈ మిషన్ ను ఇస్రో చేపట్టనుంది. ఈ మిషన్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడమే కాకుండా... వారిని సురక్షితంగా మళ్లీ భూమిపైకి తీసుకొచ్చే ప్రయోగాన్ని ఇస్రో పరీక్షించనుంది. ఏదేమైనప్పటకీ, భారత్ తరపున అంతరిక్షంలోకి వెళ్తున్న తొలి వ్యోమగామిగా వ్యోమమిత్ర రికార్డు పుటలకు ఎక్కనుంది.

More Telugu News