Andhra Pradesh: తనను 'బినామీ' అని పిలిచిన లోకేశ్ కు బొత్స కౌంటర్!

  • మండలిలో ఆసక్తికర ఘటన
  • లోకేశ్ మాట్లాడుతుండగా మధ్యలో జోక్యం చేసుకున్న బొత్స
  • భాష అదుపు చేసుకోవాలంటూ లోకేశ్ కు హితవు

ఏపీ శాసనమండలిలో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మాట్లాడుతూ, వైజాగ్ లో ఎంవీఎస్ మూర్తికి చెందిన సంస్థలకు 2013లోనే కేటాయింపులు జరిగాయని, అప్పటికి చంద్రబాబు ముఖ్యమంత్రి కూడా కారని తెలిపారు. కానీ విపక్షాలు ప్రతిదానికి "నారా లోకేశ్ బినామీలు" అంటూ ఆరోపణలు చేస్తున్నాయని, బజారున వెళ్లే ప్రతివాడ్ని తనకు బినామీ అంటున్నారని, రేపొద్దున మంత్రి బొత్సను కూడా తనకు బినామీ అన్నా ఆశ్చర్యపోనవసరం లేదని లోకేశ్ వ్యాఖ్యానించారు.

దీనిపై మంత్రి బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవ సభ్యుడు మాట్లాడుతుంటే తాము మధ్యలో జోక్యం చేసుకోదలుచుకోలేదని, కానీ తప్పడం లేదని అన్నారు. "పిట్టకొంచెం కూత ఘనం అని ఏదో తాపత్రయపడుతున్నాడులే అని మేం పట్టించుకోవడం లేదు. కానీ, బినామీలు అనే మాట బాగా లేదు. లోకేశ్ కు బినామీ అవ్వాల్సిన అవసరం మాకేం ఉంది. లోకేశ్ కు చాలామంది బినామీలు ఉన్నారు. ఆయన బతుకేంది, మేమేంటి! ఐయాం ఏ మినిస్టర్. ఆయనకు, వాళ్ల నాన్నకు 100 మంది బినామీలున్నారు. ఇప్పటికీ వారి మైండ్ సెట్ మారలేదు. లోకేశ్ తన భాషను అదుపు చేసుకోవాలి" అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

More Telugu News