Andhra Pradesh: ఈ ఖరీఫ్ నాటికి రాష్ట్రంలో 11,158 రైతు భరోసా కేంద్రాలు: సీఎం జగన్

  • ప్రతి గ్రామ సచివాలయం పక్కనే ఒక కేంద్రం ఏర్పాటు
  • రైతులకు అన్నిరకాల సహాయాన్ని అందించేందుకే ఈ కేంద్రాలు
  • ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తాయి
  • ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తాయి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రైతు భరోసా కేంద్రాలపై చర్చలో పాల్గొన్న సీఎం జగన్ రాష్ట్రంలోని ప్రతీ గ్రామ సచివాలయం పక్కనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రానున్న ఖరీఫ్ నాటికి మొత్తంగా 11,158 కేంద్రాలు పనిచేస్తాయన్నారు. రైతుల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరించడానికి ఈ కేంద్రాలు తోడ్పడుతున్నాయన్నారు.

ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణను అందిస్తారని చెప్పారు. రైతులకు కావలసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఈ కేంద్రాల్లో విక్రయిస్తారని చెప్పారు. భూసార పరీక్షలు కూడా ఇక్కడనుంచే జరుపుతారన్నారు. రైతులకు లాభం కలిగే పంటలు వేయడానికి మార్గ నిర్దేశనం కూడా ఈ కేంద్రాలు చేస్తాయన్నారు. వ్యవసాయ అనుబంధ వృత్తుల వారికి కూడా సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. పశువులకు కూడా హెల్త్ కార్డులు ఇస్తున్నామని వెల్లడించారు.

పంట వేసేటప్పుడే పంటకు గిట్టుబాటు ధర ప్రకటిస్తామని చెప్పారు. ఈ కేంద్రాలు రైతులనుంచి పంట ఉత్పత్తులు కూడా కొనుగోలు చేస్తాయన్నారు. ప్రకృతి వ్యవసాయంపై ఈ కేంద్రాల్లో రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. రైతుల అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషిచేస్తుందని పేర్కొన్నారు. వారికి ఉచిత బీమా కల్పిస్తున్నామన్నారు. ‘వైఎస్సార్ రైతులకు వడ్డీలేని రుణాలు’ పథకాన్ని ప్రారంభించామన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి రక్షణకు నిధిని ఏర్పాటు చేశామన్నారు.

More Telugu News