Jagan: సీఎంగా జగన్ నైతిక అర్హత కోల్పోయారు: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా

  • ఒక్క రాజధానిని నిర్మించలేనివారు మూడు రాజధానులను ఎలా నిర్మిస్తారు?
  • ప్రాంతాల మధ్య విద్వేషాలను రగిలిస్తున్నారు
  • మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరు దారుణం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా విమర్శలు గుప్పించింది. ఒక్క రాజధానిని కూడా నిర్మించలేనివారు మూడు రాజధానులను ఎలా నిర్మిస్తారని ఆ పార్టీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కన్వీనర్ పేరం శివనాగేశ్వరరావు గౌడ్ ప్రశ్నించారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ, మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించుకుంటే... మళ్లీ ఎన్నికలకు వెళ్లి ప్రజల ఆమోదాన్ని పొందాలని అన్నారు.

స్వప్రయోజనాల కోసం ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలను రగిలిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని కోసం దీక్షలు చేస్తున్న మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని అన్నారు. రాష్ట్రాన్ని పాలించే నైతిక అర్హతను జగన్ కోల్పోయారని చెప్పారు. శాసనమండలిని తండ్రి రాజశేఖర్ రెడ్డి పున:ప్రారంభిస్తే... ఇప్పుడు కుమారుడు జగన్ రద్దు చేస్తామంటున్నారని దుయ్యబట్టారు.

More Telugu News