KCR: యశోదా ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న కేసీఆర్!

  • గత రాత్రి యశోదా ఆసుపత్రిలో చేరిన కేసీఆర్
  • పలు రకాల పరీక్షలు చేసిన వైద్యులు
  • అన్నీ సాధారణమే అని తేలడంతో ఇంటికి

నిన్న జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతూ, హైదరాబాద్, సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రిలో చేరిన కేసీఆర్, వైద్య పరీక్షల అనంతరం అన్నీ సాధారణంగానే వున్నాయని తేలడంతో, తిరిగి ప్రగతి భవన్ చేరుకున్నారు. నిన్న రాత్రి కేసీఆర్ అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లారన్న వార్త బయటకు రావడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందాయి.

అయితే, యశోదా ఆసుపత్రి సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ ఎంవీ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం, కేసీఆర్ కు రక్త పరీక్షలు, ఈసీజీ, సీటీ స్కాన్, 2డీ ఎకో తదితర అన్ని పరీక్షలూ నిర్వహించారు. మంగళవారం రాత్రి 10.30 గంటల వరకూ ఈ పరీక్షలు జరిగాయి. వెంటనే ఫలితాలను పరిశీలించిన వైద్యులు అన్నీ సాధారణంగానే వున్నాయని చెప్పగా, ఆయన ఇంటికి వెళ్లిపోయారు.

కేసీఆర్ వెంట ఆయన భార్య శోభ, కుమార్తె కవిత, ఎంపీ సంతోష్ కుమార్‌, మనవడు హిమాన్షు తదితరులు ఉన్నారు. కేసీఆర్ ఆరోగ్యం బాగానే వుందని వైద్యులు చెప్పిన తరువాత, చివరలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ వచ్చారు. ఆపై కేసీఆర్ కేవలం స్వల్ప జ్వరంతో బాధపడ్డారని, అది కూడా తగ్గిందని, ఆందోళన అనవసరమని ఆయన తెలిపారు.

More Telugu News