Prof K Nageshwar: ఏపీకి మూడు రాజధానులు ఫెయిలా? సక్సెసా? అన్నది ఇప్పుడే చెప్పలేం: ప్రొఫెసర్ నాగేశ్వర్

  • ప్రజలకు కావాల్సింది రాజధాని కాదు అభివృద్ధి
  • రాజధానిని, అభివృద్ధిని జత చేసి మాట్లాడటం ‘రాంగ్ కాన్సెప్ట్’
  • ఇదే మాదిరి చంద్రబాబు, జగన్ లు మాట్లాడుతున్నారు

ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే ఫెయిల్ అవుతుందా? సక్సెస్ అవుతుందా? అనే విషయం ఇప్పుడే చెప్పలేమని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. అమరావతి రాజధాని కాకపోయినా, ఒకవేళ మెగా సిటీగా అభివృద్ధి చేస్తే కనుక పెద్ద ప్రమాదమేమీ ఉండదని అభిప్రాయపడ్డారు.

ప్రజలకు కావాల్సింది రాజధాని కాదు అభివృద్ధి అని అన్నారు. రాజధానిని, అభివృద్ధిని జత చేసి మాట్లాడటమనేది ‘రాంగ్ కాన్సెప్ట్’ అని, ఇదేవిధంగా చంద్రబాబు, జగన్ లు చెబుతున్నారని విమర్శించారు. క్యాపిటల్, ఎకానమీ కలిసి ఉన్నవి, అవి రెండూ వేర్వేరుగా ఉన్న రాజధానులు ఉన్నాయని చెప్పిన నాగేశ్వర్, ప్రపంచదేశాల్లో కొన్నింటిని ఉదాహరణగా చెప్పారు. అమరావతిలో రాజధాని లేకపోయినా ఎకానమీ డెవలప్ చేసే విధానాన్ని సీఎం జగన్ ఎంచుకున్నారు కనుక నష్టం జరగకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న అంశంలో హేతుబద్ధత ఉంది కానీ, అసెంబ్లీ, సచివాలయం వేర్వేరు చోట్ల ఉంచాలన్న దానిలో ఎటువంటి శాస్త్రీయత లేదని స్పష్టం చేశారు. విశాఖ అభివృద్ధి అనేది రాజధానిని ఏర్పాటు చేయడం వల్లేమీ జరగదని అన్నారు. రాజధానిని తరలించడం వల్ల అమరావతిలో అభివృద్ధి కోల్పోయే అవకాశం ఉందని చెప్పారు. రాజధానిని తరలించినా కూడా అమరావతిలో ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తామని భావించి, చిత్తశుద్ధితో ప్రభుత్వం పని చేస్తే అప్పుడు పరిస్థితి వేరే విధంగా ఉంటుందని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.

More Telugu News