Andhra Pradesh: రైతులకు సచివాలయ ఉద్యోగులు మద్దతు ఇవ్వాలి... రేపు వాళ్లే మీకు అండగా నిలుస్తారు: పవన్ కల్యాణ్

  • పవన్ ను కలిసిన రాజధాని రైతులు, మహిళలు
  • గాయపడ్డవారిని పరామర్శించిన జనసేనాని
  • సచివాలయ ఉద్యోగులు కూడా నిరసన తెలపాలని విజ్ఞప్తి

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజధాని రైతులతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా గాయపడిన రైతులను, మహిళలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సచివాలయ ఉద్యోగులకు తాను విన్నవించుకునేది ఒక్కటేనని, ఇవాళ రైతులకు సచివాలయ ఉద్యోగులు కూడా మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. రేపు ఆ రైతులే మీకు అండగా నిలుస్తారని పేర్కొన్నారు.

"రాజధాని ఆడపడుచులపై పడిన ఒక్కొక్క దెబ్బను సచివాలయ ఉద్యోగులు చూడాలి. సచివాలయ ఉద్యోగులారా, మీరు కూడా నిరసన తెలియజేయాలి. రేపొద్దున మీకు కష్టాలు వస్తే, మీకు ప్రజలు అండగా ఉండాలంటే ఇవాళ కష్టాల్లో ఉన్న ప్రజలకు మీరు మద్దతుగా నిలవండి. ఈ రాజకీయ వ్యవస్థను, నాయకులను నమ్మవద్దు... ఇవాళ ఉంటారు, రేపు వెళ్లిపోతారు. మీరు పర్మినెంటుగా ఉద్యోగం చేయాల్సిన వాళ్లు. అందుకే అమరావతి ప్రజలకు సంఘీభావం ప్రకటించాలని సెక్రటేరియట్ ఉద్యోగులను పేరుపేరునా అర్థిస్తున్నాను" అంటూ ప్రసంగించారు.

More Telugu News