Pawan Kalyan: పవన్ కల్యాణ్ ని నిర్బంధించడంపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం: జనసేన

  • నిన్నటి ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం
  • పవన్, మనోహర్ తో పాటు మా నాయకులను నిర్బంధించారు
  • అనుమతులు లేకుండా పోలీసులు చొరబడ్డారు

గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో తమ అధినేత పవన్ కల్యాణ్ ని నిన్న పోలీసులు నిర్బంధించడంపై న్యాయపరమైన చర్యలకు దిగుతామని జనసేన పార్టీ న్యాయ విభాగం నిర్ణయించింది. పోలీసు అధికారులు అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయంలోకి చొరబడటమే కాకుండా, పవన్ కల్యాణ్ ని, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు పలువురు నాయకులను నిర్బంధించడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ విషయమై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశం తీర్మానించింది.

మంగళగిరిలోని ‘జనసేన’ కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో పార్టీ రాష్ట్ర న్యాయ విభాగం ఇవాళ సమావేశం నిర్వహించింది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10.30 నిమిషాల వరకు అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా, చట్టవిరుద్ధంగా వారిని నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. ఒక పార్టీ అధ్యక్షుడిని వారి కార్యాలయంలోనే నిర్బంధించడం రాజ్యాంగ విలువలకు, వ్యక్తి స్వేచ్ఛకు విరుద్ధమైన చర్యగా అభివర్ణించింది. గాయపడిన రైతులను పరామర్శించనీయకుండా నియంత్రించడం ప్రజాస్వామ్య విలువలను మంటగలపడమేనని విమర్శించింది.

More Telugu News