CM Jagan: మధ్యాహ్న భోజన పథకానికి కొత్తపేరు ‘జగనన్న గోరుముద్ద’!

  • విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు కొత్త మెనూ
  • మధ్యాహ్న భోజనం ఆయాలకు గౌరవ వేతనం పెంపు
  • పథకం పర్యవేక్షణకు నాలుగంచెల వ్యవస్థ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తోన్న మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ఈ రోజు శాసన సభలో అమ్మ ఒడి, మధ్యాహ్న భోజన పథకాలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన పుష్టికరమైన ఆహారాన్ని అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందుకోసం మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేసి సరికొత్త మెనూను రూపొందించామన్నారు. ఈ పథకానికి ‘జగనన్న గోరుముద్ద’గా కొత్త పేరు పెట్టినట్లు ప్రకటించారు. కొత్త మెనూ ఈ రోజు నుంచి అమలు చేస్తున్నామని తెలిపారు.

కాగా, మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే ఆయాలకు ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా వెయ్యి రూపాయలనుంచి మూడువేల రూపాయలకు పెంచామని చెప్పారు. దీనివవల్ల ప్రభుత్వంపై రూ.344 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పెంచేందుకు నాలుగంచెల వ్యవస్థను తెస్తున్నామని చెప్పారు. పాఠశాల అభివృద్ధి కమిటీ నుంచి ముగ్గురు సభ్యులకు పర్యవేక్షణ బాధ్యత అప్పగించనున్నట్లు తెలిపారు. వీరితో పాటు వార్డు, గ్రామ సచివాలయంలో ఉండే విద్య, సంక్షేమ అధికారి నాణ్యతను పరిశీలించేలా చేస్తామన్నారు. వీరందరిపై ఆర్డీవో  స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందన్నారు.

రాష్ట్రంలో సుమారు 82 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ను మార్చేందుకు అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చామన్నారు. ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థుల చదువు ఆగకూడదన్న లక్ష్యంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయడానికి రూ.6,028 కోట్లు వెచ్చించామని సీఎం జగన్ తెలిపారు.

More Telugu News