MLA: ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనర్హత వేటుపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్య

  • స్పీకర్లకు అధికారమున్నప్పటికీ నిర్ణయాలు తటస్థంగా వుండవు
  • స్పీకర్ కూడా ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తే కదా..
  • పార్లమెంట్ దీనిపై పునరాలోచన చేయాలి

శాసనసభల్లో ఎమ్మెల్యేలపై, పార్లమెంటులో ఎంపీలపై అనర్హత విధించే అధికారంపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ అధికారం ఎవరికి ఉండాలనే అంశంపై మరోసారి సమీక్షించాలని పార్లమెంట్ ను కోరింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ అధికారం ఆయా సభల స్పీకర్లకున్నప్పటికీ.. ఆయన కూడా ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తే కదా? అని అభిప్రాయపడింది.

మణిపూర్ రాష్ట్రానికి చెందిన బీజేపీ మంత్రి శ్యామ్ కుమార్ పై అనర్హత వేటు వేయాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శ్యామ్ కుమార్ కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన అనంతరం బీజేపీలో చేరి మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడని తమ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టుకు చెందిన జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ అధ్వర్యంలోని ధర్మాసనం, శ్యామ్ కుమార్ అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకోవడానికి మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ కు నాలుగు వారాల సమయాన్నిచ్చింది.

ఈ గడువులోగా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కాంగ్రెస్ నేతలకు స్వేచ్ఛ ఉందని పేర్కొంటూ.. స్పీకర్ విచక్షణాధికారాలపై సమీక్ష జరపాలని పార్లమెంట్ కు సూచించింది. ప్రజా ప్రతినిధుల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు స్వతంత్ర యంత్రాంగం ఏర్పాటు మంచిదన్న అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తం చేసింది.

More Telugu News