GVL Narasimha Rao: వైసీపీ ప్రభుత్వం రాజధాని అక్రమార్కులను కాపాడే ప్రయత్నం చేస్తోందా?: బీజేపీ ఎంపీ జీవీఎల్

  • అసెంబ్లీ ఒక్కటే ఉంటే అమరావతి రాజధాని ఎలా అవుతుంది?
  • మూడు రాజధానులు ఒక మిథ్య మాత్రమే
  • స్వార్థప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తున్నారు 

విశాఖపట్నంలో సెక్రటేరియేట్, రాజ్‌భవన్‌, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు.

ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఒక్కటే ఉంటే అమరావతి రాజధాని ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. మూడు రాజధానులు ఒక మిథ్య మాత్రమే అని వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించడానికి ఇదేం కుటుంబ వ్యవహారం కాదని జీవీఎల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలని టీడీపీ వారు చేస్తున్న వాదన సరికాదని చెప్పారు.  

రాజధాని విషయంలో అక్రమాలు జరిగాయని చెబుతోన్న వైసీపీ ప్రభుత్వం... మరి విచారణ ఎందుకు చేయించట్లేదని జీవీఎల్ నిలదీశారు. మరి వైసీపీ ప్రభుత్వం రాజధాని అక్రమార్కులను కాపాడే ప్రయత్నం చేస్తోందా? అని ఆయన ప్రశ్నించారు. స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని విషయంపై జనసేన పార్టీతో కలిసి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును రాజకీయంగా ఖండిస్తామని చెప్పారు.

More Telugu News