ICC: తూచ్.. ఆ వేగం స్పీడ్‌గన్ తప్పిదమే.. శ్రీలంక పేసర్ మతీషా విసిరిన బంతిపై వివరణ

  • భారత్-శ్రీలంక మధ్య అండర్-19 ప్రపంచకప్ మ్యాచ్
  • 175 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించిన శ్రీలంక పేసర్
  • ఐసీసీ నుంచి రాని ప్రకటన

శ్రీలంక జూనియర్ జట్టు పేసర్ మతీషా పతిరణ 175 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించినట్టుగా చెబుతున్న దాంట్లో నిజం లేదని సమాచారం. భారత్‌తో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో మతీషా 175 కిలోమీటర్ల వేగంతో బంతి విసరడం హాట్ టాపిక్ అయింది. యశస్వీ జైస్వాల్‌కు మతీషా విసిరిన ఈ డెలివరీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌లోనైనా అత్యంత వేగవంతమైన డెలివరీగా నమోదైంది. దీంతో క్రికెట్ ప్రపంచం మొత్తం దీని గురించే ప్రముఖంగా చర్చించుకుంది.

అయితే, ఆ వేగం అసలైనది కాదని, వేగాన్ని కొలిచే ‘స్పీడ్‌గన్’లో సాంకేతిక లోపం కారణంగా తప్పిదం జరిగిందని చెబుతున్నారు. కాగా, ఈ రికార్డుకు సంబంధించి ఐసీసీ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటనా రాకపోవడం కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది. కాగా, అత్యంత వేగవంతమైన డెలివరీ రికార్డు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పేరుపై ఉంది. 2003 ప్రపంచకప్‌లో అక్తర్ 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. ఇప్పటి వరకు ఇదే రికార్డు.

More Telugu News