Visakhapatnam District: పెట్రోలింగ్ వాహనం అపహరించి.. పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన మతిస్థిమితం లేని వ్యక్తి!

  • రోడ్డుపక్కన వాహనాలు ఆపి తనిఖీల్లో మునిగిన పోలీసులు
  • వాహనాన్ని తీసుకుని తునివైపు బయలుదేరిన మతిస్థిమితం లేని వ్యక్తి
  • గొడిచెర్ల చౌరస్తాలో ప్రమాదానికి గురైన వాహనం

మతిస్థిమితం లేని వ్యక్తి పెట్రోలింగ్ వాహనాన్ని ఎత్తుకెళ్లి పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. విశాఖపట్టణం జిల్లా నక్కపల్లి ప్రాంతంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. అమరావతికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న టీడీపీ నాయకులు, ఆందోళనకారులను అడ్డుకునేందుకు నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం మండలాల్లోని పెట్రోలింగ్ వాహనాలతో నక్కపల్లి ఎస్సై ఆదివారం రాత్రి కాగిత టోల్‌గేట్ వద్దకు చేరుకున్నారు. వాహనాలను రోడ్డుపక్కన పార్క్ చేసి పోలీసులందరూ వాహన తనిఖీల్లో మునిగిపోయారు.

అదే సమయంలో పాయకరావుపేటకు చెందిన ఓ వ్యక్తి ఓ పెట్రోలింగ్ వాహనాన్ని స్టార్ట్ చేసి తునివైపు బయలుదేరాడు. ఈ క్రమంలో వాహనం ఎదురుగా ఉన్న కానిస్టేబుల్ బైక్‌ను ఢీకొట్టాడు. అయినప్పటికీ ఎవరూ గుర్తించలేకపోయారు. వాహన తనిఖీలు ముగిసిన తర్వాత వచ్చి చూసిన పోలీసులు పెట్రోలింగ్ వాహనం లేకపోవడంతో విస్తుపోయారు. అప్రమత్తమైన పోలీసులు వాహనాన్ని వెతుక్కుంటూ తునివైపు బయలుదేరారు.

ఈ క్రమంలో గొడిచెర్ల చౌరస్తాలో పెట్రోలింగ్ వాహనం బోల్తాపడి ఉండడాన్ని గుర్తించారు. అక్కడే ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతడికి మతిస్థిమితం లేదని గుర్తించారు. ఉన్నతాధికారుల సూచనతో అతడిని మానసిక చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వాహనాన్ని తీసుకెళ్లిన సమయంలో రోడ్డుపై రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News