bihar shelter home: బీహార్ షెల్టర్ హౌస్ కేసులో 19 మందిని దోషులుగా తేల్చిన కోర్టు!

  • 2018లో వెలుగులోకి వచ్చిన దారుణం
  • షెల్టర్ హోం బాలికలపై అత్యాచారాలు
  • బీహార్ మంత్రితో ప్రధాన నిందితుడికి సంబంధాలు

బీహార్‌లోని ముజఫర్‌పూర్ షెల్టర్ హోంలో బాలికలపై జరిగిన లైంగిక దాడుల కేసులో ఆశ్రమ నిర్వాహకుడు, మాజీ ఎమ్మెల్యే బ్రజేశ్ ఠాకూర్‌తోపాటు మరో 18 మందిని ఢిల్లీలోని అడిషనల్ సెషన్స్ కోర్టు దోషులుగా తేల్చింది. ఒకర్ని నిర్దోషిగా విడుదల చేసింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి సౌరభ్ కులశ్రేష్ఠ తీర్పు చెప్పారు. ఈ నెల 28న వాదనల అనంతరం శిక్షను ఖరారు చేయనున్నారు. దోషులందరూ బాలికలపై సామూహిక అత్యాచారాలకు, తీవ్రమైన వేధింపులకు పాల్పడ్డారని తేల్చిన న్యాయస్థానం వారిని దోషులుగా ప్రకటించింది.

టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ 2018లో ఇచ్చిన నివేదికతో దారుణమైన ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బీహార్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మంజు వర్మ భర్తకు ప్రధాన నిందితుడు బ్రజేశ్‌ ఠాకూర్‌తో సంబంధాలు ఉన్న విషయం కూడా బయటపడింది. తీర్పు విన్న అనంతరం బాలల హక్కుల పరిరక్షణ మాజీ అధికారి రవి రోషన్ కోర్టులోనే బోరున విలపించాడు. తనకే పాపం తెలియదని, బాలికలపై తాను ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడలేదని పేర్కొన్నారు. జైలులోనే తాను ఆత్మహత్య చేసుకుంటానని కన్నీరుమున్నీరయ్యాడు. దీంతో స్పందించిన న్యాయమూర్తి తీర్పుపై పైకోర్టుకు వెళ్లొచ్చని సూచించారు.

More Telugu News