Andhra Pradesh: ప్రపంచ చరిత్రలో ఇలాంటి రాక్షసులు, కీచకులు మరెవరూ ఉండరు: టీడీపీ సభ్యులపై సీఎం జగన్ ఆగ్రహం

  • సభలో టీడీపీ సభ్యుల నినాదాలు
  • నినాదాల హోరులోనే మాట్లాడిన సీఎం జగన్
  • టీడీపీ సభ్యుల తీరుతో తీవ్ర అసహనానికి గురైన సీఎం
  • మార్షల్స్ ను పిలిపించండంటూ స్పీకర్ కు విజ్ఞప్తి

ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడన్న కనీస జ్ఞానం కూడా లేకుండా పోడియం వద్దకు వచ్చి రగడ చేస్తున్న వీళ్లను ఏమనాలో అర్థం కావడంలేదని సీఎం జగన్ మండిపడ్డారు. ప్రపంచ చరిత్రలో ఇంతటి రాక్షసులు, కీచకులు, దుర్మార్గులు ఇంకెవరూ ఉండరేమో అధ్యక్షా అంటూ అసహనం ప్రదర్శించారు. కానీ ఎవరెన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినా స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు.

"రాష్ట్ర ప్రజలందరూ మీ దారుణాలు చూస్తున్నారు. ఉన్నదే పది మంది. కానీ పోడియం వద్దకు వచ్చి ముఖ్యమంత్రి చెప్పే మాటలు ఎవరికీ వినపడకూడదని ప్రయత్నిస్తున్నారు. వాస్తవాన్ని వాస్తవ రూపంలో ప్రజలకు చూపించే ప్రయత్నం మాది. 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించిన నాటి నుంచి 2014లో 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడేంత వరకు అనేక పరిణామాలు జరిగాయి. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు చారిత్రక తప్పిదాలు, అన్యాయాలు జరిగాయి. 1953లో మద్రాసును కోల్పోయాం. ఆ తర్వాత కర్నూలును పోగొట్టుకున్నాం. ఆపై  ఓటు కోసం కోట్లు ఇస్తూ హైదరాబాదును కోల్పోయాం. ఒక మనిషి చేసిన తప్పిదం వల్ల జరిగిన దారుణం ఇది" అంటూ జగన్ వివరించారు.

అయితే ఆయన మాట్లాడుతున్నంత సేపు టీడీపీ సభ్యులు జై అమరావతి, జై జై అమరావతి అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో జగన్ తీవ్ర అసహనానికి గురై మార్షల్స్ ను పిలిపించి వారిని బయటికి పంపించాలని స్పీకర్ ను అభ్యర్థించారు. అంతేకాదు, ఇక మాట్లాడడం తన వల్ల కాదన్నట్టుగా కూర్చున్నారు.

More Telugu News