Andhra Pradesh: ఇన్ సైడర్ ట్రేడింగ్ వివాదం: పయ్యావుల వర్సెస్ బుగ్గన సంవాదం!

  • ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర ప్రసంగాలు 
  • రాజధాని భూముల కొనుగోలుపై రగడ
  • సాక్షి పత్రిక కథనాన్ని ప్రదర్శించిన పయ్యావుల

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై తేదీలు సహా బదులిచ్చారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక బినామీల విషయంలో కఠినమైన చట్టం తీసుకువచ్చిందని, బినామీ ఆస్తులను వెంటనే సీజ్ చేసే అధికారం కేంద్రానికి ఉందని వివరించారు. రాజధానిలో ఎక్కడెక్కడ బినామీ ఆస్తులు ఉన్నాయో వాటన్నింటిపైనా కేంద్ర బినామీ చట్టం సాయంతో విచారణ జరిపించుకోవచ్చని సవాల్ విసిరారు. దాంతో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెంటనే స్పందించారు.

2014 అక్టోబరు 13న మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు డాక్యుమెంట్ నెం. 10960 ప్రకారం తుళ్లూరు మండలం ఐనవోలు గ్రామంలో సర్వే నెం.48-3 పయ్యావుల విక్రమ్ సింహా రెండెకరాల 13 సెంట్లు భూమి కొనడం జరిగిందని వెల్లడించారు. డాక్యుమెంట్ నెంబర్ 12025 ప్రకారం 2014 నవంబరు 3న ఇదే ఐనవోలు గ్రామంలో 49-3 సర్వే నెంబరులో ఎకరం 96 సెంట్లు కొనుగోలు చేశారని తెలిపారు. అయితే తాము ఈ సందర్భంగా పయ్యావుల విక్రమ్ సింహా ఎవరు అని అడుగుతున్నామని బుగ్గన ప్రశ్నించారు. ఈ రెండు కొనుగోళ్లు అమరావతి నోటిఫై అయిన డిసెంబరు 31 కంటే ముందు జరిగాయని ఆరోపించారు.

ఎక్కడో అనంతపురంలో ఉండే పయ్యావుల విక్రమ సింహా విజయవాడను కాదని, గుంటూరు కాదని ఐనవోలులో పక్కపక్కనే సర్వేనెంబర్లు చూసుకుని కొనుగోలు చేయాల్సిన అవసరం ఏంటని బుగ్గన నిలదీశారు. దీనికి పయ్యావుల కేశవ్ బదులిచ్చారు. మంత్రిగారు కొంచెం ఓపిక వహించి ఉంటే ఈ విషయాలన్నీ తానే వెల్లడించేవాడ్నని అన్నారు.

"నాటి క్యాబినెట్ ఈ రాష్ట్ర రాజధాని ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకుంది 1-9- 2014న. అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగింది 4-9-2014న. దీనికి సంబంధించిన వార్తలు రాష్ట్రం మొత్తం సాక్షి సహా ఇతర అన్ని పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చాయి. ఇవన్నీ నేను కొనడానికి ముందు తేదీలు. రాజధానిపై నిర్ణయం తీసుకున్న దాదాపు 40 రోజుల అనంతరం భూములు కొనుగోలు చేశాం. రాజధానిలో నాకూ ఓ ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో కొనుగోలు చేశాం" అంటూ వివరణ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో బుగ్గన స్పందిస్తూ, సెప్టెంబరులో వచ్చింది అధికారిక ప్రకటన కాదని, ప్రతిపాదన మాత్రమేనని అన్నారు. సీఆర్డీఏ చట్టం వచ్చింది డిసెంబరు 31న అని, ఆ తర్వాతే రాజధాని గ్రామాలు నోటిఫై చేయడం జరిగిందని తెలిపారు. దాంతో పయ్యావుల స్పందిస్తూ, 7-10-2014న సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రదర్శించారు.

"నేను భూమి కొనడానికి ముందు, ఉండవల్లి నుంచి అమరావతి దాకా రైతుల నుంచి  స్వచ్ఛందంగా భూములు సేకరించడానికి మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తున్నారంటూ కథనం రాశారు. సాంకేతికంగా డిసెంబరు 31న ప్రకటన వచ్చి ఉండొచ్చేమో కానీ, అమరావతి రాజధాని అని అంతకుముందే నిర్ణయం అయింది. సీఎం ఉరవకొండలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తే సాయంత్రానికి ఆర్డర్లు వస్తాయా? ఇదీ అంతే! అసెంబ్లీ తీర్మానించిందని, అమరావతి ఏర్పాటుకు ప్రతిపక్ష నాయకుడు ఏకగ్రీవంగా అంగీకరించాడని వార్తలు వచ్చిన తర్వాత నేను భూములు కొంటే తప్పొచ్చిందా?"  అంటూ దీటుగా బదులిచ్చారు.

More Telugu News