Arvind Kejriwal: జనం మధ్య వుండిపోయి.. ఈ రోజు నామినేషన్ వేయలేకపోయిన కేజ్రీవాల్!

  • ఢిల్లీలో రోడ్ షో నిర్వహించిన కేజ్రీవాల్
  • నిర్ణీత సమయానికి కార్యాలయానికి చేరుకోలేకపోయిన వైనం
  • రేపు నామినేషన్ వేస్తానన్న కేజ్రీ

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు నామినేషన్ వేయలేకపోయారు. భారీ రోడ్ షో కారణంగా కేజ్రీవాల్ నిర్ణీత సమయానికి నామినేషన్ దాఖలు చేయాల్సిన కార్యాలయానికి చేరుకోలేకపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేపు నామినేషన్ వేస్తానని చెప్పారు. నామినేషన్ల దాఖలుకు రేపే చివరి రోజు కావడం గమనార్హం.

మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ, నామినేషన్ వేయడానికి సయమం మించిపోతోందని తన మనుషులు తనకు చెప్పారని... కానీ తన కోసం వచ్చిన ఇంత మందిని వదిలి ఎలా వెళ్లగలనని ఆయన ప్రశ్నించారు.

ఢిల్లీలోని ప్రఖ్యాత వాల్మీకి మందిర్ నుంచి కేజ్రీవాల్ రోడ్ షో ప్రారంభమైంది. పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ వరకు రోడ్ షో కొనసాగింది. రోడ్ షోలో కేజ్రీవాల్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ నేత సంజయ్ సింగ్ ఉన్నారు.

2015 అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 67 స్థానాలను ఆప్ గెలిచింది. 54.3 శాతం ఓట్లను ఆ పార్టీ సాధించింది. ఈసారి మొత్తం సీట్లను గెలుచుకుంటామని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 46 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు 24 మంది కొత్త అభ్యర్థులను ఆప్ బరిలోకి దింపింది.  

తన ప్రచారం సందర్భంగా కేజ్రీవాల్ పలు హామీలను గుప్పిస్తున్నారు. ఉచిత విద్యుత్తు, ఉచితంగా నీటి సరఫరా, ప్రతి విద్యార్థికి ప్రపంచ స్థాయి విద్యను అందిస్తామని హామీ ఇస్తున్నారు.

More Telugu News