sports: వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ కొనసాగుతాడు: కోహ్లీ

  • ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో రాహుల్ రాణించాడు
  • రాహుల్ కీపింగ్ చేస్తే.. జట్టులోకి మరొక బ్యాట్స్ మన్..  
  • రిషభ్ పంత్ స్థానానికి ఎసరు

టీమిండియా ‘వికెట్ కీపర్ బరి’ లోకి కేఎల్.రాహుల్ కూడా వచ్చాడు. ప్రపంచకప్ తర్వాత జట్టులో వికెట్ కీపర్ గా కొనసాగుతున్న యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఇటీవల బ్యాటింగ్ లో విఫలమవడం, కీపింగ్ లో ఒక్కోసారి తడబాటు పడటంతో టీం మేనేజ్ మెంట్ పంత్ కు ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించింది. తాజాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ గా విజయవంతం కావడంతో పంత్ స్థానం ప్రమాదంలో పడింది. త్వరలో భారత జట్టు న్యూజిలాండ్ లో పర్యటించనున్న నేపథ్యంలో వికెట్ కీపర్ గా రాహుల్ ను కొనసాగించాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు.

ఈ మార్పుతో జట్టు బ్యాటింగ్ సామర్థ్యం పెరుగుతుందని కోహ్లీ చెప్పాడు. న్యూజిలాండ్ పర్యటనకోసం ఆస్ట్రేలియాతో ఆడిన భారత ఎలెవన్ జట్టును మర్చాల్సిన అవసరం లేదన్నాడు. 2003 ప్రపంచకప్ లో రాహుల్ ద్రవిడ్ కీపింగ్ చేశారంటూ.. అప్పుడు ఆ విధంగా జట్టులో సమతుల్యత వచ్చిందని పేర్కొన్నాడు.

‘న్యూజిలాండ్ పర్యటనలో రాహుల్ ను కీపర్ గా ఎందుకు కొనసాగించకూడదు? ఆస్ట్రేలియాతో వన్డే సిరీలో రాహుల్ తనకిచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పుతో పాటు కీపర్ గా కూడా తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాడు. రాహుల్ కీపింగ్ బాధ్యతలు చేపడితే.. జట్టులోకి మరొక బ్యాట్స్ మన్ ను తీసుకోవచ్చు. కీపర్ గా రాహుల్ కొనసాగుతాడు’ అని చెప్పాడు కోహ్లీ.

More Telugu News