BJP cheaf: బీజేపీ జాతీయ అధ్యక్షునిగా జె.పి.నడ్డా ఎన్నిక ఇక లాంఛనమే!

  • ఈరోజు మొదలైన ఎన్నికల ప్రక్రియ
  • ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ 
  • ఇప్పటికే నామినేషన్ వేసిన నడ్డా

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఎన్నిక ఇక లాంఛనమేనని భావిస్తున్నారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం ఎన్నిక ప్రక్రియను నిర్వహించి ఆయన ఎన్నికైనట్లు ప్రకటించాల్సి ఉంటుంది. అందువల్ల ఈ రోజు ఉదయం ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12.30 నుంచి 1.30 గంటల వరకు నామినేషన్లు పరిశీలిస్తారు. 1.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే రేపు ఎన్నిక నిర్వహిస్తారు.

కాగా, ఈ రోజు ఉదయం 10 గంటలకు  పార్టీ అతిరథ మహారథుల సమక్షంలో నడ్డా తన నామినేషన్ దాఖలు చేశారు. మరెవరూ నామినేషన్ దాఖలు చేసే అవకాశం లేకపోవడంతో పార్టీ ఎన్నికల నిర్వహణ ఇన్ చార్జి రాధామోహన్ సింగ్ మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించే అవకాశం ఉంది.

గత ప్రభుత్వం హయాంలో నడ్డా కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నడ్డా పాట్నాలో జన్మించారు.

More Telugu News