Amaravati: ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందా? పోతుందా?... శాసనసభలో నేడే బిల్లు!

  • ఆరేళ్ల క్రితం విడిపోయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
  • ఏపీకి కొత్త రాజధానిగా గుంటూరు, విజయవాడ మధ్య ప్రాంతం
  • ఇప్పటికే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణం
  • పాలన వికేంద్రీకరణవైపు మొగ్గు చూపుతున్న జగన్ సర్కారు
  • నేడు అసెంబ్లీ ముందుకు కీలక బిల్లు

అమరావతి...!
ఆరేళ్ల క్రితం ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ ప్రాంతం విడిపోయిన తర్వాత, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా గుంటూరు, విజయవాడల మధ్య ఏర్పడిన కొత్త నగరం. ఈ నగరంలో ఇప్పటికే సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు తదితర భవనాలతో పాటు ప్రజల నివాసానికి ఎన్నో భవంతులు సిద్ధమవుతున్నాయి. కానీ ఇది నిన్నటి మాట.

పాలన వికేంద్రీకరణ పేరిట, మూడు ప్రాంతాలుగా విభజించి, ఒక్కో చోట ఒక్కో విభాగాన్ని ఏర్పాటు చేయాలని, తాజాగా అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అమరావతిలో భూములను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చిన రైతులు తీవ్రంగా ఆక్షేపిస్తూ, గడచిన నెల రోజులకు పైగా నిత్యమూ ఆందోళనలు చేస్తున్నారు. ఇక నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటం, తొలి రోజునే రాజధాని విభజన అంశంపై క్యాబినెట్ ఓ నిర్ణయం తీసుకుని, కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుండటంతో ఇప్పటికే అమరావతి అష్టదిగ్బంధమైంది.

రాజధాని, ముఖ్యంగా వెలగపూడి సచివాలయం, మందడం మీదుగా దారితీసే సీడ్ యాక్సెస్ రోడ్ తదితరాలను పోలీసులు దిగ్బంధం చేశారు. అసెంబ్లీలో వైసీపీకి ఎదురు లేకపోయినా, మండలిలో నూతన బిల్లులను వ్యతిరేకించాలని విపక్ష తెలుగుదేశం పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ప్రజలు మొత్తం ఇప్పుడు శాసనసభవైపు చూస్తూ, ప్రభుత్వ వ్యూహం, అమరావతి భవిష్యత్ ఏంటన్న విషయాలపై చర్చించుకుంటున్నారు. మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందితే, రైతులు ఇచ్చిన భూముల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతుంది. వారిలో నెలకొన్న ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందన్న చర్చ కూడా జరుగుతోంది.

అయితే, తమ పార్టీ అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతిస్తుందే తప్ప, పాలన వికేంద్రీకరణకు కాదని తెలుగుదేశం పార్టీ అంటోంది. అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మినహా, మిగతా తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలందరినీ పోలీసులు ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. ప్రకాశం బ్యారేజ్ పై వాహనాల రాకపోకలను నియంత్రించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, సచివాలయ ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మినహా మరెవరినీ బ్యారేజ్ పైకి అనుమతించడం లేదు.

ఇదిలావుండగా, ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను అధ్యయనం చేసేందుకు తమకు కనీసం వారం రోజుల సమయం కావాలని అసెంబ్లీలో డిమాండ్ చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ఇదే సమయంలో అధికార వైసీపీ సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాజధానిపై ఆ పార్టీ స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

విశాఖపట్నంలో కార్యనిర్వహణ, అమరావతిలో శాసన, కర్నూలులో న్యాయ రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసేసుకున్నట్టు సమాచారం. రాష్ట్ర అభివృద్ధి, రాజధాని అంశాలపై రెండు కమిటీలు నివేదికలు ఇవ్వగా, అవి ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నాయి. వీటిని తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఐ వ్యతిరేకిస్తుండగా, ప్రభుత్వం ఓ హై పవర్ కమిటీని వేసిన సంగతి తెలిసిందే.

హై పవర్ కమిటీ కూడా తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ కమిటీ రిపోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంది. దీనిపై ఈ ఉదయం, వైఎస్ జగన్ నేతృత్వంలో సమావేశం కానున్న రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆపై హై పవర్ కమిటీ నివేదిక అసెంబ్లీకి రానుండగా, అమరావతి భవితవ్యం మరో రెండు రోజుల్లో తేలనుంది.

More Telugu News