Thammineni Seetharam: ముట్టడిస్తాం, దాడులు చేస్తామంటే నేరం కిందకు వస్తుంది: తమ్మినేని సీతారాం

  • ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కుందన్న తమ్మినేని
  • భావస్వేచ్ఛ హరించే హక్కు ఎవరికీ లేదని వెల్లడి
  • ముట్టడులు, దాడులు రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యలు

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్క పౌరుడికీ ఉందని, నిరసనలు చట్టాలకు లోబడి ఉండాలని తెలిపారు. భావస్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. అయితే హక్కులు ఉన్నాయని ఏమైనా చేస్తామంటే కుదరదని, ముట్టడిస్తాం, దాడులు చేస్తామంటే నేరం కిందకు వస్తుందని స్పష్టం చేశారు. రేపు అసెంబ్లీ ముట్టడికి టీడీపీ, అమరావతి జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో తమ్మినేని ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతోంది. ముట్టడులు, దాడుల ద్వారా రాజ్యాంగ వ్యవస్థలను హెచ్చరించినట్టవుతుందని పేర్కొన్నారు.

సభ్యులు కానివారు చట్టసభల్లోకి రాకుండా నిరోధించే అధికారం ఉందని, సభ్యులు కానివారు ప్రవేశిస్తే శిక్షించే అధికారం ఉందని వెల్లడించారు. సభ్యులు తమ అభిప్రాయాలను సభలో చెప్పవచ్చని వివరించారు. దాడులు చేస్తామనడం మాత్రం రాజ్యాంగ విరుద్ధం అని పునరుద్ఘాటించారు. సభ సజావుగా జరిగేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని తమ్మినేని తెలిపారు.

More Telugu News