బుల్లెట్లకు ఎదురొడ్డయినా అసెంబ్లీని ముట్టడిస్తాం : బుద్దా వెంకన్న

19-01-2020 Sun 12:13
  • ఎవరు అడ్డుకుంటారో మేమూ చూస్తాం 
  • ప్రజా ఉద్యమాన్ని పోలీసులు ఆపలేరు 
  • పోలీసుల తీరు ఎమర్జెన్సీని తలపిస్తోంది

అమరావతిని రాజధానిగా సాధించుకునేందుకు బుల్లెట్లకు ఎదురొడ్డుతామని, అసెంబ్లీ ముట్టడి జరిగి తీరుతుందని, ఎవరు ఆపుతారో చూస్తామని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. ఈ రోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అసెంబ్లీ ముట్టడిని ఆపడం జగన్ కాదుకదా అతని తాత వల్ల కూడా సాధ్యం కాదని, అమరావతిలో జరుగుతున్నది ప్రజా ఉద్యమమన్నారు.

అమరావతిలో పోలీసుల తీరు దారుణంగా ఉందని, ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయని ఆరోపించారు. అయినా ప్రాణాలు ఎదురొడ్డయినా అసెంబ్లీని ముట్టడిస్తామని, తమ శవాల పై నుంచి వెళ్లి బిల్లు పాస్ చేసుకోవాలని సూచించారు. అమరావతి రాజధానిగా కొనసాగితే చంద్రబాబుకు పేరు వస్తుందన్న కక్షతో జగన్ కుయుక్తులకు పాల్పడుతున్నారని, ఇది ఎంతవరకు న్యాయమని బుద్దా ప్రశ్నించారు. వైసీపీకి ఓట్లేసినందుకు జగన్ వారి నోట్లో మట్టి కొడుతున్నారని ధ్వజమెత్తారు.