Mushfiqur Rahim: పాకిస్తాన్‌లో క్రికెట్‌ ఆడటం కంటే నాకు నా ప్రాణాలే ముఖ్యం: ముష్ఫికర్ రహీం

  • పాక్ లో భద్రత గురించి నా కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు
  • పాకిస్థాన్ కు వెళ్లేందుకు ఒప్పుకోవడం లేదు
  • పరిస్థితులు మెరుగైన తర్వాత పాక్ లో ఆడుతా

10 ఏళ్ల క్రితం (2009) పాకిస్థాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. వారు ప్రయాణిస్తున్న బస్సుపై ముష్కరులు దాడి చేశారు. ఆ దాడిలో పలువురు క్రికెటర్లకు గాయాలయ్యాయి. అప్పటి నుంచి ఆ దేశంలో పర్యటించేందుకు ఏ దేశం కూడా ఆసక్తిని కనబరచడం లేదు. ఒక వేళ ఏదైనా జట్టు పర్యటించినా స్టార్ క్రికెటర్లు ఎవరూ ఆ దేశంలో అడుగుపెట్టడం లేదు. ఆయా దేశాల క్రికెట్ బోర్డులు కూడా తమ ఆటగాళ్లపై ఈ విషయంలో ఒత్తిడి చేయడం లేదు.

తాజాగా పాకిస్థాన్ గడ్డపై ఆ దేశంతో బంగ్లాదేశ్ తలపడబోతోంది. మొత్తం రెండు టెస్టులు, మూడు టీ20లు, ఒక వన్డే మ్యాచ్ ఆడబోతున్నాయి. ఈ మ్యాచ్ లన్నీ ఒకే సిరీస్ లో భాగమైనప్పటికీ... మూడు విడతలుగా ఈ సిరీస్ జరగనుంది. ఈనెల 24న లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో తొలి టీ20 జరగనుంది.

అయితే, టూర్ ప్రారంభం కాకముందే పాకిస్థాన్ కు బంగ్లాదేశ్ కీపర్-బ్యాట్స్ మెన్ ముష్ఫికర్ రహీం షాకిచ్చాడు. పాకిస్థాన్ కు తాను వెళ్లబోనంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు లేఖ రాశాడు. ముష్ఫికర్ విన్నపానికి బీసీబీ అంగీకారం తెలిపింది. రానున్న రోజుల్లో ముష్ఫికర్ బాటలోనే మరికొందరు క్రికెటర్లు అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ సందర్భంగా ముష్ఫికర్ మీడియాతో మాట్లాడుతూ, పాకిస్థాన్ సిరీస్ కు తాను వెళ్లలేనంటూ బోర్డుకు లేఖ రాశానని చెప్పాడు. తన విన్నపానికి బోర్డు అంగీకరించిందని తెలిపాడు. ఒక్క టీ20లకు మాత్రమే కాకుండా మొత్తం సిరీస్ కు తాను దూరంగానే ఉంటానని చెప్పాడు. పాకిస్థాన్ లో భద్రతకు సంబంధించి తన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారని, పాక్ కు వెళ్లేందుకు ఒప్పుకోవడం లేదని... అందుకే ఆ దేశానికి వెళ్లకూడదని తాను నిర్ణయించుకున్నానని తెలిపాడు. తన దేశం క్రికెట్ ఆడుతున్నప్పుడు ఖాళీగా కూర్చోవడం చాలా కష్టమే అయినప్పటికీ... కుటుంబం కోసం తప్పదని చెప్పాడు.

పాకిస్థాన్ లో పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడ్డాయని ముష్ఫకర్ తెలిపాడు. అయితే తన ప్రాణం కంటే క్రికెట్ తనకు ముఖ్యం కాదని చెప్పాడు. శ్రీలంక టీమ్ పై దాడి జరగడానికి ఏడాది ముందు (2008) తాను పాకిస్థాన్ లో ఆడానని తెలిపాడు. పాక్ పిచ్ లు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటాయని... అక్కడ ఆడటాన్ని తాను మిస్ అవుతున్నానని చెప్పాడు. పాకిస్థాన్ లో ప్రశాంత వాతావరణం ఏర్పడిన తర్వాత తాను తప్పకుండా అక్కడ ఆడుతానని తెలిపాడు.

More Telugu News