Maharashtra: షిర్డీలో ఓ వైపు బంద్...మరోవైపు దర్శనాలు

  • స్వచ్ఛందంగా పాటిస్తున్న షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామస్థులు 
  • ఈ ఉదయం భారీగా తరలివచ్చిన భక్తులు 
  • ఏర్పాట్లు చేసిన సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్

షిర్డీ సాయిబాబా జన్మస్థలంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ రోజు షిర్డీలో ఓవైపు బంద్, మరోవైపు స్వామివారి దర్శనాలు యథావిదిగా సాగుతున్నాయి. పర్భాణీ జిల్లా పాథ్రీలోని సాయినాథుని జన్మస్థలంలో సౌకర్యాల కల్పనకు రూ.100 కోట్లు కేటాయించనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ప్రకటనతో వివాదం రగులుకున్న విషయం తెలిసిందే. పాథ్రీ సాయిబాబా జన్మస్థలమని ఆధారాలేవీ లేవని షిర్డీవాసులు వాదిస్తున్నారు. ప్రభుత్వ ప్రకటనను నిరసిస్తూ ఆదివారం బంద్ కు పిలుపు ఇచ్చారు. దీంతో షిర్డీ చుట్టుపక్కల గ్రామాలతోపాటు షిర్డీలోనూ అంతా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు.

దుకాణాలు, పాఠశాలలు మూతపడడంతో కార్యకలాపాలన్నీ స్తంభించి వీధులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు ఆలయంలో దర్శనాలు యథావిధిగా సాగుతున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వారికి అవసరమైన ఏర్పాట్లను 'సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్' చేపట్టింది.

కాగా, ప్రభుత్వ నిర్ణయంపై వివాదం నెలకొనడంతో సమస్య పరిష్కరించేందుకు ఇందుకు సంబంధించిన వారందరితో ఉద్దవ్ త్వరలో సమావేశమవుతారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు 'పాథ్రీ కృతి సమితి' కూడా ఆదివారం నుంచి పాథ్రీలో బంద్ పాటిస్తున్నట్లు ప్రకటించింది.

More Telugu News