ఇరాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

19-01-2020 Sun 09:55
  • దాడులు చేస్తే తీవ్రంగా ప్రతిదాడులు చేస్తాం
  • ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కూలిపోతోంది
  • ప్రజలు చాలా కష్టాలను అనుభవిస్తున్నారు

అమెరికా, ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. ట్విట్టర్ ద్వారా ట్రంప్ స్పందిస్తూ... అమెరికన్లపై, వారి ఆస్తులపై దాడులు చేస్తే చాలా తీవ్రంగా ప్రతిదాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కూలిపోతోందని, ఆ దేశ ప్రజలు చాలా కష్టాలను అనుభవిస్తున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖమైనీ జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని చెప్పారు. ఉగ్రవాదాన్ని వదిలేసి ఇరాన్ ను గొప్ప దేశంగా మార్చడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

మరోవైపు ఖమైనీ కూడా అమెరికాపై విరుచుకుపడ్డారు. ఇరాన్ ప్రజలకు అండగా ఉన్నామంటూ అమెరికా అసత్య ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. ఇరాన్ ప్రజలతో కలిసి ఉన్నా... వారి ప్రజల్లో విషపు కత్తులను దింపేందుకు అమెరికా యత్నిస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా తమపై ఆంక్షలు విధిస్తున్నా... వాటిని తట్టుకుని నిలబడ్డామని చెప్పారు.