మీరు ఎవరికి ఓటేశారో నాకు తెలిసిపోతుంది.. పొరపాటు చేయవద్దు: ఎర్రబెల్లి

19-01-2020 Sun 08:52
  • వేరే పార్టీకి ఓటు వేసి ఆ తర్వాత బాధ పడొద్దు
  • టీఆర్ఎస్ కు ఓటు వేస్తేనే అభివృద్ధి సాధ్యం
  • ఎవరికి ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటా

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో, ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని అస్త్రాలను వినియోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఓటర్లను ఉద్దేశించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

మీరు ఎవరికి ఓటు వేసినా తనకు తెలిసిపోతుందని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. వేరే పార్టీకి ఓటు వేసి ఆ తర్వాత బాధపడితే లాభం లేదని... పొరపాట్లకు తావివ్వకుండా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న టీఆర్ఎస్ కే ఓటు వేయాలని కోరారు. టీఆర్ఎస్ కు ఓటు వేస్తేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే... ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో మంత్రిని అయ్యానని... మరో నాలుగేళ్లు పదవిలో కొనసాగుతానని చెప్పారు. తాను చేయాల్సిన అభివృద్ధి ఎంతో ఉందని... టీఆర్ఎస్ ను గెలిపించడం ద్వారా అందరూ తనకు సహకరించాలని విన్నవించారు.