మగతనాల గురించి మాట్లాడొద్దు: రోజాపై దివ్యవాణి ఫైర్

19-01-2020 Sun 07:12
  • మేము కూడా నీలా మాట్లాడగలం
  • కానీ మాకు సంస్కారం ఉంది
  • మహిళలను కించపరిస్తే ఊరుకోబోము

రాజధానిని తరలించవద్దంటూ అమరావతి ప్రాంత మహిళలు చేపట్టిన నిరసన కార్యక్రమాలు నెల రోజులు దాటిపోయాయి. మరోవైపు, ఈ నిరసనలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రోడ్లపైకి వచ్చి మహిళలు ఆందోళన చేయాల్సిన అవసరమేముందని, అమరావతిలో మగావాళ్లు లేరా? అంటూ ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై టీడీపీ నాయకురాలు దివ్యవాణి మండిపడ్డారు. మగతనాల గురించి మాట్లాడవద్దని రోజాకు హితవు పలికారు. తాము కూడా నీలా మాట్లాడగలమని... అయితే, తమకు సంస్కారం ఉందని చెప్పారు. మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన తల్లి, చెల్లి రోడ్ల మీద తిరిగి ప్రచారం చేయలేదా? వాళ్లు మహిళలు అన్న విషయం రోజాకు తెలియదా? అని ప్రశ్నించారు.