మేము అధికారంలోకి వస్తే..: పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర హెచ్చరిక

19-01-2020 Sun 06:53
  • మేము అధికారంలోకి రాకూడదని కోరుకోండి
  • అక్రమ కేసులు పెట్టిన వారిని జైలుకు పంపిస్తాం
  • పోలీసుల యాక్షన్ కు మా రియాక్షన్ తప్పకుండా ఉంటుంది

పోలీసులను ఉద్దేశించి టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన రోజుల వ్యవధిలోనే ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి రాకూడదని పోలీసులు భగవంతున్ని కోరుకోవాలని అన్నారు. తాము అధికారంలోకి వస్తే... తమపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని... టీడీపీ కార్యకర్తలను కొడుతున్నారని మండిపడ్డారు.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు చాలా అన్యాయం జరుగుతోందని చెప్పారు. పోలీసుల యాక్షన్ కు తమ రియాక్షన్ తప్పకుండా ఉంటుందని అన్నారు. తమకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా త్వరలోనే దీక్షలకు దిగుతామని చెప్పారు. ఇటీవల దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకించుకుంటామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.