ఎవరో కొన్న భూములకు నా పేరు రాస్తారా?... నీ కేసులకు, పిచ్చిరాతలకు భయపడను: దేవినేని ఉమ

18-01-2020 Sat 21:25
  • ట్విట్టర్ లో ధ్వజమెత్తిన ఉమ
  • తన గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం
  • అధికారులు ఐఏఎస్ శ్రీలక్ష్మి ఫొటో పెట్టుకోవాలని హితవు

గత ఎనిమిది నెలలుగా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్నానని తనపై కక్షగట్టారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. తన గొంతు నొక్కి, బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎవరో కొన్న భూములకు సాక్షిలో తన పేరు రాసి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కేసులకు, పిచ్చిరాతలకు, బెదిరింపులకు, నీ దుర్మార్గాలకు భయపడేది లేదు అంటూ స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగేందుకు సీఎం జగన్ మన రాష్ట్ర ప్రయోజనాలపై దెబ్బకొడుతున్నాడని ఉమ విమర్శించారు. భవిష్యత్ తరాలు జగన్ ను క్షమించవని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు కూడా ఉమ హితవు పలికారు. 'ప్రభుత్వ, అధికార కార్యాలయాల్లో స్ఫూర్తి కోసం గొప్ప నాయకుల చిత్రపటాలు ఎలా పెట్టుకుంటామో, ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు టేబుళ్ల మీద గోల్డ్ మెడలిస్ట్ ఐఏఎస్ శ్రీలక్ష్మి ఫొటో పెట్టుకోవాలి. గతంలో జగన్, విజయసాయిరెడ్డి మాటలు నమ్మి ఏ పరిస్థితిలో ఉందో..!' అంటూ ఉమ ట్వీట్ చేశారు.