ఇవాళ అమరావతిని మోసం చేసినవాళ్లు రేపు విశాఖను మోసం చేయరని నమ్మకం ఏంటి?: చంద్రబాబు

18-01-2020 Sat 20:06
  • భీమవరంలో చంద్రబాబు ప్రసంగం
  • పశ్చిమ గోదావరి జిల్లాలో అమరావతి జేఏసీ యాత్ర
  • పోలీసులు బలిపశువులుగా మారుతున్నారన్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అమరావతి పరిక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 20న అమరావతి జేఏసీ నేతృత్వంలో అసెంబ్లీ ముట్టడి చేపడుతున్నట్టు వెల్లడించారు. రాజధాని అంశం కేవలం అమరావతి రైతులకు సంబంధించిన అంశం కాదని, రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా భవిష్యత్ తరాలకు సంబంధించిన అంశమని అన్నారు.

రాజధానిని తరలిస్తోంది విశాఖ ప్రజలపై అభిమానంతో కాదని, అక్కడి భూములపై వైసీపీ కన్నుపడినందునే రాజధాని మార్పు జరుగుతోందని ఆరోపించారు. ఇవాళ అమరావతి ప్రజలను మోసం చేసినవాళ్లు రేపు విశాఖ ప్రజలను మోసం చేయరన్న నమ్మకం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. మహిళలపై దాడులు చేయిస్తూ సీఎం పైశాచిక ఆనందం పొందుతున్నారని, జగన్ కోసం పోలీసులు బలిపశువులుగా మారుతున్నారని వ్యాఖ్యానించారు. అమరావతిని యువత కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.