Shoretest person: ప్రపంచంలోనే అతి పొట్టిమనిషి ఖగేంద్ర మృతి!

  • 2.4 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే పొట్టి మనిషిగా గుర్తింపు
  • 2010లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన ఖగేంద్ర
  • నేపాల్ పర్యాటక ప్రచారకర్తగా రాణింపు

ప్రపంచంలోనే అతి పొట్టి మనిషిగా పేరుపొందిన 27ఏళ్ల  ఖగేంద్ర థాప మగర్‌ నిన్న రాత్రి మరణించాడు. నేపాల్ కు చెందిన ఖగేంద్ర కేవలం 2.4 అడుగుల ఎత్తు మాత్రమే ఎదిగాడు. ఇతను గత కొంత కాలంగా న్యూమోనియాతో బాధపడుతున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖగేంద్రకు నిన్న రాత్రి తీవ్రంగా గుండెపోటు రావడంతో మరణించాడని సోదరుడు మహేష్‌ థాప మగర్‌ తెలిపాడు. 2010లో ఖగేంద్ర తన 18వ ఏట ప్రపంచంలోనే అతి పొట్టి మనిషిగా గుర్తింపు పొంది ‘గిన్నిస్’ సర్టిఫికేట్‌ అందుకున్నాడు.

అదే సంవత్సరం జరిగిన నేపాల్‌ భామల అందాల పోటీలో హల్‌చల్‌ చేసి విజేతలతో ఫొటోలకు పోజిచ్చాడు. ఖగేంద్ర నేపాల్ పర్యాటక శాఖకు అధికారిక ప్రచారకర్తగా పనిచేశాడు. ‘ప్రపంచంలోనే అత్యంత పొట్టివాడు పుట్టిన నేపాల్‌లో.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం అందాలు’ అంటూ తన మాతృదేశం పర్యాటకాభివృద్ధికి కృషి చేశాడు. కొంతకాలం తర్వాత ఖగేంద్ర పొట్టి రికార్డును నేపాల్ దేశస్థుడు బహదూర్ డాంగీ సొంతం చేసుకున్నాడు. డాంగీ ఒక అడుగు 7.9 అంగుళాల పొడవు మాత్రమే ఉండటంతో గిన్నిస్ బుక్ లో అతని పేరు నమోదయింది. 2015లో డాంగీ మరణించడంతో మళ్లీ ఆ రికార్డు ఖగేంద్ర పేరు మీదకే మారింది.

More Telugu News