America: ఇరాన్‌పై మరోమారు విరుచుకుపడిన ట్రంప్.. ‘మాటలు జాగ్రత్త’ అంటూ హెచ్చరిక

  • ఇరాన్ సుప్రీంనేతపై ట్రంప్ ఫైర్
  • అయతొల్లా ట్వీట్‌కు ఘాటు రిప్లై
  • నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌ను మరోమారు హెచ్చరించారు. ఇరాన్ అత్యున్నత నేత అయిన అయతొల్లా ఖొమైనీని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. జాగ్రత్తగా మాట్లాడాలంటూ హితవు పలికారు. ఇరాన్ సుప్రీంనేత అమెరికా, ఐరోపాలపై కఠినంగా మాట్లాడుతున్నారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దేశ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోందని వ్యాఖ్యానించారు. ఆయన కాస్త జాగ్రత్తగా మాట్లాడాలని ట్రంప్ తన ట్విట్టర్ ద్వారా అయతొల్లాను హెచ్చరించారు.  
 
ఇరాన్ ప్రజలకు అండగా ఉంటామంటూ అమెరికా అబద్ధాలు చెబుతోందని, అది చెప్పినట్టే జరిగినా, అది వారి గుండెల్లో విషపు కత్తులు దింపడానికేనంటూ ఖొమైనీ శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇప్పటికే ఆ ప్రయత్నంలో విఫలమైందని, ఇకపైనా ఓడిపోతూనే ఉంటుందని అయతొల్లా తేల్చి చెప్పారు. ఆయన ట్వీట్‌కు సమాధానంగానే ట్రంప్ తాజా ట్వీట్ చేసి ఉంటారని భావిస్తున్నారు.

More Telugu News