Disha: ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటన.. తప్పు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనన్న సుప్రీంకోర్టు

  • ‘దిశ’ ఎన్‌కౌంటర్ ఘటనపై దర్యాప్తుకు కమిషన్ ఏర్పాటు
  • దర్యాప్తుకి ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో చెప్పిన ధర్మాసనం
  • సౌకర్యాలు కల్పించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు

హైదరాబాద్‌లో జరిగిన ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్ విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగితే అధికారులను బాధ్యులుగా చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎన్‌కౌంటర్‌ను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గతంలో విచారణ జరిపింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు అనంతరం ఆరు నెలల్లో నివేదిక అందించాలని ఆదేశిస్తూ గత నెల 12న ఓ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

సుప్రీంకోర్టు  మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలోని ఈ కమిషన్‌లో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌పీ సొండూర్‌బల్డోటా, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్‌లు సభ్యులుగా ఉన్నారు. తాజాగా ఈ కమిషన్‌కు సుప్రీం ధర్మాసనం విధివిధానాలు జారీ చేసింది. దర్యాప్తు సందర్భంగా ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలనే దానిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన పరిస్థితులు ఏమిటి? ఈ వ్యవహారంలో ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగిందా? ఒక వేళ నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు తేలితే సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో సిట్టింగ్ కమిషన్‌ చైర్మన్‌కు రూ.1.50 లక్షలు, మిగిలిన ఇద్దరు సభ్యులకు లక్ష చొప్పున చెల్లించడంతోపాటు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశాల్లో పేర్కొంది.

More Telugu News