CAA: సీఏఏపై పట్టుమని పది మాటలు మాట్లాడు చూద్దాం!: రాహుల్ గాంధీకి జేపీ నడ్డా సవాల్

  • సీఏఏను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ
  • సీఏఏపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శలు

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు సంధించారు. పౌరసత్వ సవరణ చట్టంపై దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారంటూ రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఏఏకి మద్దతుగా ఢిల్లీలో బౌద్ధ మత సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నడ్డా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో కొందరు ఎలాంటి అవగాహన లేకుండా తమ పరిజ్ఞానాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారని, తద్వారా ప్రజానీకాన్ని పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇది దురదృష్టకర పరిణామం అని వ్యాఖ్యానించారు. రాహుల్ కు దమ్ముంటే సీఏఏపై కనీసం 10 వాక్యాలైనా మాట్లాడాలని సవాల్ చేశారు. సీఏఏతో రాహుల్ కు ఉన్న సమస్యేంటో కనీసం రెండు పంక్తుల్లో అయినా చెప్పమనండి చాలు... ఓ పెద్ద పార్టీకి నాయకత్వం వహిస్తూ ఇలా దేశాన్ని పక్కదారి పట్టించడం సరికాదని హితవు పలికారు.

More Telugu News