Varla Ramaiah: పాపం, ఆ ఐఏఎస్ అధికారి గుడ్డెద్దు చేలో పడ్డట్టు నివేదిక చదివేశారు: వర్ల

  • మద్రాస్ ఐఐటీ అధ్యయనం ఉత్తుత్తిదే అని తేల్చిన వర్ల రామయ్య
  • ప్రభుత్వం ఏ నివేదిక ఇస్తే అదే చదివేశారని విజయ్ కుమార్ పై వ్యాఖ్యలు
  • అమరావతి ముంపు ప్రాంతం కాదని గ్రీన్ ట్రైబ్యునల్ చెప్పిందన్న వర్ల

బోస్టన్ నివేదికలో తప్పుడు అంశాలు పొందుపరచడం ద్వారా ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని టీడీపీ ఏపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బోస్టన్ నివేదికలో మద్రాస్ ఐఐటీ గురించి అసత్య ప్రస్తావన చేశారని, పాపం, ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గుడ్డెద్దు చేలో పడ్డట్టు నివేదిక చదివేశారని వ్యాఖ్యానించారు. మద్రాస్ ఐఐటీ అమరావతిపై అధ్యయనం చేసిందంటూ ప్రభుత్వం పచ్చి అబద్ధం ఆడిందని, ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ కూడా అందులో ఏముందో పరిశీలన చేయకుండా ఉన్నది ఉన్నట్టు చదివేశాడని ఆరోపించారు.

"అమరావతిపై ఐఐటీ వాళ్లు నివేదిక ఇవ్వొచ్చా? అసలా ఐఐటీ అధ్యయనం చేసింది నిజమేనా? మద్రాస్ ఐఐటీలో మెటియరాలాజికల్ డిపార్ట్ మెంట్ ఉందా? లేదా? అనేది చూసుకోలేదు. విజయ్ కుమార్ ఎలాంటి ఆలోచన లేకుండా చదివేశారు. దున్నపోతు ఈనిందంటే అదిగో దూడను కట్టేయండి అన్నారు. ఇది ప్రభుత్వమా, దోపిడీ దొంగల ముఠానా?" అని మండిపడ్డారు.

"గ్రీన్ ట్రైబ్యునల్ అమరావతిని ఎలాంటి వరద ముప్పు ప్రాంతంగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. దీనికి ఏమంటారు విజయ్ కుమార్ గారూ, బొత్స గారూ! బోస్టన్ కమిటీ ఎన్నడూ మద్రాస్ ఐఐటీని సంప్రదించలేదు. అలాంటప్పుడు మద్రాస్ ఐఐటీ అమరావతిపై అధ్యయనం చేసిందనడంలో ఎలాంటి వాస్తవం లేదు" అని వర్ల స్పష్టం చేశారు.

More Telugu News