ఉరిశిక్ష విషయంలో మేము చేయాల్సిందంతా చేశాం: కేజ్రీవాల్

17-01-2020 Fri 16:40
  • మేము అలసత్వాన్ని ప్రదర్శించలేదు
  • గంటల వ్యవధిలోనే పేపర్ వర్క్ పూర్తి చేశాం
  • త్వరగా శిక్షను అమలు చేయాలనే మేము కోరుకుంటున్నాం

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు ఆలస్యానికి ఢిల్లీ ప్రభుత్వమే కారణమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై నిర్భయ తల్లి కూడా స్పందిస్తూ, తన కుమార్తె మరణాన్ని కొందరు వారి రాజకీయ స్వార్థానికి వాడుకుంటున్నారని కంటతడి పెట్టారు. ఈ నేపథ్యంలో, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు.

 ఉరిశిక్షను అమలు చేసే విషయంలో తమ పాత్ర ఏమాత్రం లేదని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి తాము ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించలేదని అన్నారు. గంటల వ్యవధిలోనే పేపర్ వర్క్ ను ఢిల్లీ ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు. దోషులకు వీలైనంత త్వరగా ఉరిశిక్షను అమలు చేయాలనే తాము కూడా కోరుకుంటున్నామని అన్నారు.

ఇదే అంశంపై కేంద్ర మంత్రి జవదేకర్ మాట్లాడుతూ ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆప్ వల్లే నిర్భయకు న్యాయం జరగడంలో ఆలస్యం జరుగుతోందని ఆయన అన్నారు. క్షమాభిక్ష పిటిషన్లను వేసుకోవాలంటూ గత రెండున్నరేళ్ల కాలంలో దోషులకు ఢిల్లీ ప్రభుత్వం నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.