Janasena: నిన్నటితో జనసేన పార్టీ అధ్యాయం ముగిసినట్టే!: వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ఎద్దేవా

  • గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయారు
  • ఇప్పుడు 2024లో అధికారంలోకి వస్తామని అంటున్నారు
  • ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలు పవన్‌కు పట్టవు  

బీజేపీతో కలిసి పనిచేస్తామని ప్రకటన చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. విశాఖపట్నంలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ కోసమే జనసేన పార్టీని పవన్‌ నడిపిస్తున్నారని, ఆ పార్టీకి సిద్ధాంతాలు లేవని ఆరోపించారు. జనసేన, బీజేపీ పొత్తు కొత్తేం కాదని అన్న ఆయన.. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి జనసేన పనిచేసిందని గుర్తు చేశారు.

ఇతరుల పొత్తులపై తమ పార్టీకి ఎలాంటి అభ్యంతరాలు లేవని అమర్‌నాథ్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలు వంటివి పవన్‌కు అవసరం లేదని, ఆయన కేవలం పొలిటికల్‌ ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చారని ఆయన అన్నారు.

గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు 2024లో అధికారంలోకి వస్తామని అంటున్నారని చురకలంటించారు. బీజేపీతో చేతులు కలపడంతో నిన్నటితో జనసేన పార్టీ అధ్యాయం ముగిసినట్లేనని ఆయన అన్నారు.

More Telugu News