Andhra Pradesh: చంద్రబాబును కాపాడేందుకు కూటమిగా కలిశారు: పవన్ పై అంబటి ధ్వజం

  • జనసేన, బీజేపీ పొత్తుపై అంబటి విమర్శలు
  • నాలుగున్నరేళ్లు కలిసి ప్రయాణించేది నిజమేనా అంటూ సందేహం
  • చంద్రబాబు కోసం పుట్టినపార్టీ అంటూ జనసేనపై విమర్శలు

బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడడం పట్ల వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. ఎక్కడా స్థిరత్వంలేని వ్యక్తి నాలుగున్నరేళ్లు ఓ పార్టీతో కలిసి ప్రయాణించేది నిజమేనా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. 2014లో టీడీపీ, బీజేపీతో కలిసి పనిచేశారని, ఆ తర్వాత బీజేపీకి ఎడంగా జరిగి, టీడీపీకి దూరమైనట్టు నటించారని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో అభ్యర్థులను దింపకుండా, టీడీపీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో అభ్యర్థులను బరిలో దింపి లోపాయికారీగా సహకరించారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు సిద్ధాంతపరంగానే కలిశామంటూ ఇవాళ చెబుతున్నారు, ఏంటి మీ సిద్ధాంతం? అని ప్రశ్నించారు.

"మాపై విమర్శలు చేయడం ఎందుకు? అనేక ప్రజాసంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రజారంజక పాలన అందిస్తున్నాం. రైతు భరోసా, అమ్మ ఒడి వంటి పథకాలు తీసుకువచ్చి ఏ ప్రభుత్వం చేయని పరిపాలన చేస్తున్నాం. 151 సీట్లతో అధికారంలోకి వచ్చి పరిపాలన చేస్తుంటే ఏడు నెలలకే వైఫల్యం చెందింది అనడం సమంజసం కాదు. మీరు కలవాలనుకుంటే కలవండి. రెండు పార్టీలు కలిసినా, మూడు పార్టీలు కలిసినా మాకేం కాదు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే పార్టీ కాదు మాది. మేం ఎవరితోనూ చేతులు కలపలేదు. వారితో వెళితే ఎన్ని సీట్లు వస్తాయి? వీళ్లతో కలిస్తే ఎన్ని సీట్లు వస్తాయి? అంటూ లెక్కలు వేసుకునే పార్టీ కాదు మాది.

మంత్రివర్గ విస్తరణలో బంధుప్రీతి ఎక్కడుందో చూపించండి! మమ్మల్ని చంద్రబాబు గాటన కట్టేస్తారా? ప్రభుత్వంపై ప్రజల్లో ఏదో ఒక రూపంలో అస్థిరత తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు సహకరించేందుకు ఈ కూటమి ఏర్పాటు చేశారా? అని అడుగుతున్నా. అసలు మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. చంద్రబాబు పాలనలోనూ జగనే టార్గెట్. ఇప్పుడు జగన్ పాలనలోనూ జగనే టార్గెట్.

చంద్రబాబు నాయుడ్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే మీ రాజకీయ ప్రయాణం చేస్తున్నారు. చంద్రబాబు కోసమే పుట్టిన రాజకీయ పార్టీ మీది. చంద్రబాబు ఇప్పటికే చాలామందిని బీజేపీలోకి పంపారు. సుజనా, సీఎం రమేశ్ తదితరులను బీజేపీలోకి పంపారు. ఇప్పుడు మీరు కూడా కలిసి పనిచేస్తారో, కలిసిపోయి పనిచేస్తారో చూడాలి. మీకు ఈ రాష్ట్ర రాజకీయాల్లో అర్హతలేదు. ఏ పార్టీతోనైనా కలుస్తారు మీరు. ఏ పార్టీతోనైనా ఊరేగుతారు. మీ స్వభావమే అంత!" అంటూ నిప్పులు చెరిగారు.

More Telugu News